Sorakaya Garelu Recipe in Telugu : సొరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, సొరకాయతో కర్రీ వండుకోవడం, పప్పు, సాంబార్ చేసుకోవడం మనందరికీ తెలిసిందే! ఎప్పుడూ కూరలే కాకుండా ఈ సారి కొత్తగా సొరకాయతో గారెలు చేసేయండి. ఈ సొరకాయ గారెలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి సొరకాయ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- సొరకాయ తురుము - కప్పు
- మినప్పప్పు - పావుకప్పు
- పచ్చిశనగపప్పు - పావుకప్పు
- బియ్యం పిండి - పావు కప్పు
- ఎండుమిర్చి - 4
- పచ్చిమిర్చి - 8
- ఉప్పు- తగినంత
- కొత్తిమీర తురుము - కొద్దిగా
- నూనె - వేయించడానికి సరిపడా
- అల్లం ముక్కలు - 2 చిన్నవి
- వెల్లుల్లి రెబ్బలు - 10
- జీలకర్ర - టీస్పూన్
- కరివేపాకు - 2
- ఉల్లిపాయ - 2
తయారీ విధానం:
- ముందుగా ఓ మిక్సీ జార్లో మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆపై ఎండుమిర్చి వేసి మరోసారి గ్రైండ్ చేసుకోండి.
- ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చిలు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు తరుగు, సన్నటి ఉల్లిపాయ ముక్కలు, గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మిశ్రమం వేసి బాగా కలుపుకోండి.
- ఆపై ముందుగా రెడీ చేసుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు పొడి, బియ్యం పిండి వేసుకుని కలుపుకోండి. (అయితే, ఇక్కడ మీరు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సొరకాయ తురుములోనే నీరు ఉంటుంది. ఆ వాటర్ గారెలు చేయడానికి సరిపోతుంది. సరిపోకపోతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు)
- చివర్లో ఉప్పు రుచి చూసుకుని, జీలకర్ర వేసి కలపండి.
- ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి గారెలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి.
- ఇప్పుడు పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని గారెలు చేసి ఆయిల్లో వేసుకోండి. ఆపై స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గారెలు రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి.
- క్రిస్పీగా వేగిన సొరకాయ గారెలను ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇలానే మిగిలిన పిండితో గారెలు చేసుకుంటే సరిపోతుంది.
- అంతే ఇలా సింపుల్‌గా తయారు చేసుకుంటే రుచికరమైన సొరకాయ గారెలు మీ ముందుంటాయి.
- సొరకాయ గారెలు నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
"గుత్తి వంకాయ మసాలా కర్రీ" - కుక్కర్లోనే అద్దిరిపోయేలా ఇలా ఈజీగా చేసేయండి!
పెసర్లు నానబెట్టడం, రుబ్బడం అవసరం లేదు! -ఈ పొడితో ఎప్పుడైనా "కమ్మటి పెసరట్టు" వేసుకోవచ్చు!