Peddi Reddy Encroachment the Lands of Buggamatham in Tirupati: విలువైన స్థలం కంటపడితే చాలు అది అడవా, చెరువా, ప్రభుత్వ భూమా, లేదా మఠం భూమా అన్న పట్టింపు లేదు. ఆక్రమించడమే ఆయన నైజం. గత వైఎస్సార్సీపీ హయాంలో అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో నంబర్ టూగా అధికారాన్ని చలాయించి ప్రకృతి వనరులను దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూకబ్జా బాగోతం ఇది. వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 ఎకరాల బుగ్గమఠం భూములను ఆక్రమించడమే కాకుండా చుట్టూ ప్రహరీ కట్టేశారు. ఆ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం, గోశాల నిర్మించారు.
బుగ్గమఠం భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి: వైఎస్సార్సీపీ హయాంలో ప్రకృతి వనరుల్ని భూబకాసురుడిలా భోంచేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట రిజర్వు ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారు. అంతేకాక అక్కడో విశాలమైన వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో గోశాల నిర్వహిస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి అనుచర గణమైతే అతనిని మించిపోయారు. ఆయన ఆక్రమించిన 3 ఎకరాలకు పక్కనే మరో మూడున్నర ఎకరాలు ఆయన ఆక్రమణలో ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
4.20 ఎకరాల్లో విలాస భవనం: తిరుపతి నడిబొడ్డున మారుతినగర్, రాయల్‌నగర్‌లో ఉన్న బుగ్గమఠం భూముల్లోని 4.20 ఎకరాల్లో పెద్దిరెడ్డి విలాసవంతమైన నివాసభవనాన్ని నిర్మించుకున్నారు. ఆ భూములను తాను కొన్నానని చెబుతున్న పెద్దిరెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న 3 ఎకరాల బుగ్గమఠం భూములను ఆక్రమించారు. వైఎస్సార్సీపీ హయాంలో తన ఇంటికి వెళ్లే మార్గానికి తిరుపతి నగరపాలక సంస్థ నిధుల్లో 19 లక్షలు వెచ్చించి మరీ ఆగమేఘాలపై రోడ్డు వేయించుకున్నారు. ఇంకెవరూ ఆ మార్గంలో వెళ్లేందుకు వీల్లేకుండా రెండువైపులా గేట్లు పెట్టేశారు. స్థానిక ప్రజల కోసమని రోడ్డు వేసి వారికే రాకపోకలు లేకుండా చేయడమేంటని అప్పట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ ఆ గేట్లు అలానే ఉండటం గమనార్హం. ఆ మార్గంలోకి తమను అనుమతిస్తున్నా అప్పడప్పుడూ గేట్లు మూసేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
బుగ్గమఠం చరిత్ర: రామానంద సంప్రదాయాన్ని పాటించే ఉత్తరాది బైరాగులు తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ దక్షిణ మాఢవీధిలో బుగ్గమఠం ఏర్పాటు ఏర్పాటు చేశారు. మఠం ఆవరణలో కోదండరామస్వామి ఆలయ నిర్వహణతోపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సాధువులకు భోజనం, బస వంటి సదుపాయాల కల్పన ద్వారా హిందూమత పరిరక్షణ లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. బుగ్గమఠానికి చంద్రగిరి రాజులు భూములు, ఆస్తుల్ని దానంగా ఇచ్చారు. 1970లో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహించేలా బుగ్గమఠాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తెచ్చారు.
దేవదాయశాఖ కార్యాలయ రిజిస్టార్లు, రెవెన్యూ రికార్డులు, అడంగల్ మేరకు బుగ్గమఠానికి 123.43 ఎకరాల భూమి ఉండేది. 1983, 1986 సంవత్సరాల్లో 76.65 ఎకరాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. 1990, 1991లో ప్రైవేటు చర్చల ద్వారా ధర నిర్ణయించి 24.29 ఎకరాలను విక్రయించగా మరో 22.49 ఎకరాలు మఠం ఆధీనంలో ఉండాలి. కానీ 14.19 ఎకరాలు లీజుదారులుగా చలామణి అవుతున్న ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. మరి కొంత భూమిని ఆక్రమణదారులు చెరపట్టి నిర్మాణాలు చేపట్టగా కేవలం 38 సెంట్ల స్థలం మాత్రమే మఠం ఆధీనంలో ఉంది.
లీజుల పేరుతో అక్రమాలు: తిరుపతి వంటి నగరంలో 7.10 ఎకరాల భూమి సంవత్సరానికి 25 రూపాయలకే లీజుకు దొరుకుతుందంటే నమ్ముతారా? నమ్మకం కుదరకపోతే బుగ్గమఠం భూముల లీజుల పేరుతో సాగుతున్న దందాను చూడాల్సిందే. 14.19 ఎకరాలను బుగ్గమఠం మఠాధిపతి తమకు లీజుకు ఇచ్చారని నలుగురు చెబుతున్నారు. డి.మునిస్వామికి 1.81 ఎకరాలను సంవత్సరానికి 190 రూపాయలకు పట్టెం వెంకటరాయలుకి 7.10 ఎకరాలను ఏడాదికి 25 రూపాయలకు, యశోదకు ఎకరన్నర భూమిని 80 రూపాయలకు, మునిరత్నంకి 4.38 ఎకరాల్ని 53 రూపాయలకి లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ మఠాధిపతి వారికి ఆ భూముల్ని లీజుకిచ్చినట్లు ఎక్కడా ఆధారాల్లేవు. గత 15 ఏళ్లుగా వారెవరూ ఆ నామమాత్రపు లీజు మొత్తాన్ని కూడా మఠానికి గానీ, దేవదాయశాఖకు గానీ చెల్లించడం లేదు. ఆ భూముల్లో ఉన్నవారిని అనధికారిక అనుభవదారులుగా గుర్తించి ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. అనధికారిక లీజుల ముసుగులో ఆ భూముల్లో కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. గొర్రెల సంత నిర్వహణకు అద్దెకిస్తున్నారు. గుడిసెలు, షెడ్లు, ఇళ్లు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారు. టెండర్‌లో కొబ్బరికాయలు పాడినవారికి వాటిని నిల్వ చేయడానికి అద్దెకిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు.
గతంలో బుగ్గమఠం భూములు కొనుగోలు చేసిన డి.వెంకటేశన్ నుంచి 2.96 ఎకరాలు, డి.మునిస్వామి నుంచి 1.24 ఎకరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొని అందులో ఇల్లు నిర్మించుకున్నారు. పట్టెం వెంకటరాయలుకి ఏడాదికి 25 రూపాయలకు లీజుకిచ్చినట్లు చెబుతున్న 7.10 ఎకరాల భూమి పెద్దిరెడ్డి ఇంటికి తూర్పు, ఉత్తరం వైపున ఉంది. అందులో 3 ఎకరాలను పెద్దిరెడ్డి ఆక్రమించి పార్టీ కార్యాలయం, గోశాల ఏర్పాటు చేశారు. మిగతా 4.10 ఎకరాలకుగాను 60 సెంట్లలో మునీశ్వరస్వామి గుడి ఉంది. మిగిలిన 3.50 ఎకరాలు వెంకటరాయలు ఆధీనంలో ఉంది. అతనికి పెద్దిరెడ్డి అండదండలున్నాయి.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక: పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు గతంలో దేవదాయ, రెవెన్యూశాఖల అధికారులు ప్రయత్నించినా సాధ్యం కాలేదని, ఆయన తన అధికారాన్ని ఉపయోగించి వారిని బెదిరించారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. బుగ్గమఠం భూముల్ని సర్వే చేయించాలంటూ 2024 జులైలో రెవెన్యూశాఖకు, అక్టోబరులో పోలీసు అధికారులకు మఠం అసిస్టెంట్ కమిషనర్ లేఖలు రాశారని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూముల్ని స్వాధీనం చేసుకోవాలని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సిఫార్సు చేసింది. ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
జీపీఎస్ ద్వారా కొలతలు - పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యంపై విచారణ
పెద్దిరెడ్డి భూ దోపిడీ - ఆ రోడ్డులో 2.2 కిలోమీటర్లు అటవీ భూమిలోనే!