TTD Special Security Arrangements at Alipiri Path Way : అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు వద్ద చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం, టీటీడీ అటవీశాఖ పటిష్ఠ చర్యలు చేపట్టాయి. ఇటీవల చిరుత జాడ కన్పించడంతో ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సిబ్బంది నాలుగు బృందాలుగా సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేస్తున్నారు.
వంద మంది వరకు భక్తుల గుంపు వెంట నలుగురు సిబ్బంది కొంత దూరం వచ్చి మరో బృందం సిబ్బందికి వారి రక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలా నరసింహస్వామి ఆలయం వరకు రక్షణగా వెళ్తున్నారు. సీసీ కెమెరాలు, కెమెరా ట్రాప్‌లలో జంతువులను గుర్తిస్తే వెంటనే అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుని వాటిని అటవీ ప్రాంతంలోకి పంపే ఏర్పాట్లు ఉన్నాయి.
సమన్వయంతో గస్తీ : భక్తులు జంతువుల దాడులకు గురికాకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ అటవీశాఖ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ తెలిపారు. విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు.