PAPIKONDALU TOUR PACKAGE : పాపికొండల టూర్ అనగానే స్నేహితులంతా ఎగిరిగంతేస్తుంటారు. సౌకర్యాల లేమి కారణంగా గతంలో పడిన ఇబ్బందులన్నీ ఇక తీరినట్లే. కేరళ తరహాలో వెదురు చెక్క కాటేజీలతో పాటు టెంట్లు అందుబాటులోకి రానున్నాయి. సౌకర్యాలు మెరుగుపర్చి పర్యాటకాన్ని తీర్చిదిద్దేలా అడుగులు పడుతున్నాయి.
రోజూ అరగంటే ఛాన్స్ - ఆ తర్వాత ఈ అందాల దీవి మునిగిపోతుంది!
గలగలాపారే గోదారమ్మ, చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, పక్షుల కిలకిలా రావాలు, అల్లంత దూరంలో కనిపించే చిన్న చిన్న గూడేలు, గుడిసెలు కాంక్రీట్ జంగల్కు దూరంగా ప్రకృతి ఒడిలో ప్రయాణం అనగానే గుర్తొచ్చేది పాపికొండల టూర్ మాత్రమే. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పాపికొండల్లోనే బస చేసేలా మరిన్ని ఏర్పాట్లతో ముందుకొస్తోంది.
పాపి కొండల టూర్లో కేరళ తరహాలో కాటేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పోలవరం మండలం కొరుటూరు సమీపంలోని తేనె కొండపై ఇవి ఐదు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇకపై అటవీ శాఖ అధికారులు ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా కేరళ తరహాలో మరిన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న చెక్క కాటేజీల్లో విడిది చేయడానికి రోజుకు రూ.8500 చెల్లించాలి. అదే క్లాత్ టెంట్లలో అయితే రూ.1800 చెల్లిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది టెంట్లలో బసచేసేందుకు అసక్తి చూపుతున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. పర్యాటకుల ఆదరణ నేపథ్యంలో మరిన్ని టెంట్లు, కాటేజీలతో పాటు స్పీడ్ బోట్లు కూడా నడపాలని భావిస్తున్నారు.
అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు రూ.1.29 కోట్లతో పలు ప్రతిపాదనలు పంపారు. ఇందులో అయిదు కాటేజీలు, స్పీడ్‌బోట్లు, బోటు దిగి కొండపై ఉన్న కాటేజ్‌ల వద్దకు వృద్ధులు, మహిళలను తీసుకెళ్లేందుకు వాహనం, జనరేటర్ కావాలని ప్రతిపాదనలు పంపినట్లు పోలవరం అటవీశాఖ అధికారి వలీ చెప్పారు. పాపికొండల అభయారణ్యం నుంచి రోడ్డు మార్గంలో పర్యాటకులు 55 కిలోమీటర్లు వాహనాలపై ప్రయాణించి కొరుటూరు చేరుకోవడానికి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతోంది. అందుకే బోట్లలో వెళ్లడానికి పర్యాటకులు మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం తేనె కొండపై 20 టెంట్లు అద్దెకు ఇస్తున్నారు. పర్యాటకుల రద్దీ మేరకు మరో 20 టెంట్లు కావాలని ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రైవేటు వ్యక్తులు నదీ తీరంలోని ఇసుక తిన్నెలపై, గోదావరి ఒడ్డున తాత్కాలికంగా వెదురు కర్రలతో టెంట్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చేవారు. పర్యాటకుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేయడంతో ఇబ్బందిగా ఉండేది. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో అవన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం కొరుటూరు కాటేజీల వద్ద బస ఏర్పాట్లు ఉండటంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.
'తిరుపతిలో ఎక్కువ రోజులు భారీ వర్షాలు! - అనూహ్యంగా మారుతున్న వాతావరణం'
ప్రాణాలకు తెగిస్తేనే 'డేరియన్ గ్యాప్' దాటేది - అమెరికా అక్రమ వలసల మార్గమిదే!