Gold Theft Case in Guntur District: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు జాతీయ రహదారి కూడలి వద్ద బంగారం చోరీ కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో దొంగతనం జరగడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై 5 కిలోల బంగారు ఆభరణాలను సంచిలో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ సంచి లాక్కుని పారిపోయారని మంగళగిరి నివాసి దివి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోనికి వెళ్తే: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంజనేయకాలనీలో ఉంటున్న దివి రాము విజయవాడలో బంగారం దుకాణం నడుపుతున్నారు. అతని వద్ద పని చేస్తోన్న బంధువు నాగరాజు 5 కిలోల బంగారు ఆభరణాలతో శనివారం రాత్రి స్కూటీపై ఇంటికి బయల్దేరారు. ఆత్మకూరు అండర్ పాస్ కూడలిలో రాత్రి 9 గంటల సమయంలో వెనక నుంచి ద్విచక్ర వాహనంపై హెల్మెట్లు వేసుకుని వచ్చిన ఇద్దరు యువకులు స్కూటీపై ఉన్న సంచిని లాక్కొని పారిపోయారని నాగరాజు బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
దీంతో వారు పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దుకాణదారులెవరూ కూడా అలాంటిదేమీ జరగలేదని చెబుతున్నారని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బంగారం విలువ సుమారు రూ. 3.40 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నాగరాజు సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 8:30 గంటల నుంచి 9:15 గంటల వరకు సదరు వ్యక్తి ఇతరులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు 9:05 గంటలకు చోరీ జరిగిందని చెబుతున్నారు. అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
అసలు దొంగతనం జరిగిందా? లేదా? పోలీసులు ఘటనాస్థలంలో దీనికి సంబంధించి రాత్రి 12 గంటల వరకు విచారణ జరిపారు. బాధితుని అదుపులోకి తీసుకుని ఘటనపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. చోరీ జరిగిందా? లేదా? అనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దమొత్తంలో బంగారం చోరీ జరిగితే ఆ ప్రాంతంలోని వారెవరూ తమకు తెలియదని చెప్పడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.
రూ.10వేలు ఇవ్వలేదని- యజమాని భార్యకు చెందిన 12 తులాల నగల చోరీ
'మీ మెడలోని గొలుసు తాకితే మాకు అదృష్టం' -సినీఫక్కీలో పూజారికే శఠగోపం పెట్టిన దొంగలు