Govt Subsidy For Poor Disabled People On Petrol Or Diesel : స్వయం ఉపాధితోపాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే పేద దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామమాత్రంగా అమలుచేసిన ‘రాయితీపై పెట్రోలు/డీజిల్’ పథకాన్ని ఇకపై దివ్యాంగుల ఉపాధికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం సమర్థంగా అమలు చేయనుంది. అందులో భాగంగానే ఈ పథకం కింద 2024-25 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.26 లక్షలు కేటాయించింది.
దీనికోసం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు ప్రకటనలు సైతం విడుదల చేశారు. మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఉపయోగించే దివ్యాంగులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వారి వాహనాల కోసం వాడే పెట్రోలు/డీజిల్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీగా రీయింబర్స్ చేస్తారు. ఈ డబ్బును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా జమ చేస్తారు.
కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులను అభినందించిన లోకేశ్
50 శాతం రాయితీ : పేద దివ్యాంగులు పెట్రోలు/డీజిల్ ఖర్చులో అందించే ఈ 50 శాతం రాయితీని లబ్ధిదారుడు తన వాహనంలో ఇంటి నుంచి పని ప్రదేశానికి, అలాగే తిరిగి ఇంటికి వచ్చేందుకు మాత్రమే వర్తింపచేస్తారు. 2 హార్స్‌పవర్ ఇంజిన్ సామర్థ్యం ఉండే దివ్యాంగుల వాహనాలకు నెలకు గరిష్ఠంగా 15 లీటర్లు, అదేవిధంగా 2 హార్స్ పవర్ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉండే దివ్యాంగుల వాహనాలకు నెలకు గరిష్ఠంగా 25 లీటర్ల వరకు పరిమితి విధించారు. పేద దివ్యాంగులు వారు కొనుగోలు చేసిన పెట్రోలు/డీజిల్ బిల్లులు సమర్పిస్తే దాని ప్రకారం రాయితీ మొత్తాన్ని జమ చేస్తారు.
4 లక్షల మంది దివ్యాంగులు : అయితే 2019-24 మధ్య గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నామమాత్రంగా మార్చింది. దీనికి 2023-24లో కేటాయించిన నిధులే ఉదాహరణ. ఆ ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా పేద దివ్యాంగులకు రాయితీపై పెట్రోలు/డీజిల్ అందించేందుకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే కేటాయించారు. అందులోనూ ఖర్చు చేసింది మాత్రం రూ.1.86 లక్షలే. ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం రాష్ట్రంలో 4 లక్షల మంది వరకు అంగవైకల్యం కేటగిరీలో ఉన్న దివ్యాంగులున్నారు. వారిలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న పేద దివ్యాంగులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు.
వికలాంగులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి: అఖిల భారత వికలాంగుల సంఘం