Vigilance Investigation on Mission Bhagiratha : తెలంగాణలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్మిషన్ భగీరథ (Mission Bhagiratha) పథకాన్ని అమలు చేసింది. ఇందుకోసం 2016లో కృష్ణా, గోదావరి నదుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రక్షిత నీటిని అందించేందుకు సుమారు రూ.46,000ల కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టి సారించింది.
Mission Bhagiratha Scheme in Telangana :మిషన్ భగీరథకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను విచారణకు ఎంచుకుంది. ఇప్పటికే ఈ పథకం ఇంజినీర్ల నుంచి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పలు రికార్డులను సేకరించింది. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.7,000ల కోట్ల మేర అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై విజిలెన్స్ ఫోకస్ - కీలక పత్రాలు స్వాధీనం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గోదావరి నుంచి నిజామాబాద్ గ్రామీణ, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి బోధన్, జుక్కల్, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి తదితర నియాజకవర్గాలకు రక్షితనీరు అందించేందుకు పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సేకరించిన వివరాలు ఆధారంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు రూ.2670 కోట్ల వ్యయంతో 1645 గ్రామాలకు నీరందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. రికార్డుల ప్రకారం 1198 ఓవర్‌హెడ్ సర్వీసింగ్ రిజర్వాయర్లు(ఓహెచ్‌ఎస్‌ఆర్), 5973 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు నిర్మించారు. 5,58,171 గృహాలకు రక్షిత నీటిని సరఫరా చేసినట్లు చెబుతుండటంతో పలు ఇళ్లలోనూ తనిఖీలు చేయాలని విజిలెన్స్ నిర్ణయించింది.