Centre Fully Finance to Polavaram Project :పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం తేల్చిచెప్పడంతో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో పోలవరానికి పెద్ద భరోసా దక్కింది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదని యావద్దేశానికి ఆహార భద్రత అందించే కీలక ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఆశలకు కేంద్రం ఊపిరి పోసింది.
జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీలినీడలు :పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చే విషయంలో ఏడెనిమిదేళ్లుగా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే పునరావాసం, భూసేకరణ కోసమే 33 వేల కోట్లు అవసరమవుతాయని 2017-18లోనే తేల్చారు. ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్రం వెనకడుగు వేసింది. ఒకానొక దశలో పునరావాసం, భూసేకరణలతో తమకు సంబంధం లేదని వాదించింది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సీఎం చంద్రబాబు మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.
2013-14 ధరలతో నీటిపారుదల విభాగానికయ్యే వ్యయం 20,398 కోట్లు రూపాయలు మాత్రమే ఇస్తామని, అంతకు మించి ఇవ్వబోమని కేంద్రం చెబుతూ వచ్చింది. 2020 అక్టోబరులోనూ దీనిపై కేంద్ర ఆర్థికశాఖ కొర్రీ వేసి ఆ నిధులే ఇస్తామంటూ పేర్కొంది. ఇప్పటి వరకు తాజా డీపీఆర్ (DPR) ఆమోదం పొందకపోవడంతో ఈ అంశంలో అనుమానాలు అలానే ఉన్నాయి.
పోలవరానికి త్వరలో రూ.12 వేల కోట్లు - నిధుల విడుదలకు కేంద్రం సానుకూలం - Polavaram project funds
నిధులు ఎప్పటి నుంచో పెండింగ్ :పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్ స్థాయి దాటి నిధులు ఖర్చు చేయడంతో కేంద్రం ఆ మొత్తం ఇవ్వడం లేదు. కొత్త డీపీఆర్‌కు (DPR) ఆమోదం లేకపోవడంతో 2000 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం 2017-18 ధరలతో రూ. 55,548.87 కోట్ల రూపాయలతో రెండో డీపీఆర్‌కు ఒక దశ ఆమోదం సాధించింది. ఆ తర్వాత కేంద్రం రివైజ్డ్ కాస్ట్ కమిటీని (Revised Cost Committee) ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అనేక దశల్లో పరిశీలించి 2020లో రూ. 47,725.47 కోట్ల రెండో డీపీఆర్‌కు ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత 2020లోనే కేంద్ర ఆర్థిక శాఖ రూ.20,398.81 కోట్లే ఇస్తామంటూ లేఖ రాయడంతో రాష్ట్రం గుండెల్లో రాయిపడింది.
తొలిదశ పేరుతో కొత్త డీపీఆర్ సమర్పించాలని కేంద్రం సూచించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తొలిదశలో మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెడితే పునరావాసానికి ఎంత ఖర్చవుతుందో, ఆ మొత్తానికి నిధులు ఎంత అవుతాయో చెప్పాలని కోరింది. ప్రస్తుతం రూ.30,436.95 కోట్లకు పోలవరం తొలిదశ పూర్తి చేసేలా దాదాపు అన్ని స్థాయిల్లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే ప్రాజెక్టు తొలిదశకు మరో డీపీఆర్ ఆమోదించినట్లవుతుంది. తక్షణమే రూ.12,157 కోట్లు అందుబాటులోకి వస్తాయి.