YSRCP Leader Attacked Galiveedu MPDO of Annamayya District : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దాడులతో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకులకు ఇంకా అధికార మదం, అహంకారం తగ్గినట్లు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పాత పంథానే కొనసాగిస్తూ అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి విచక్షణా రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన MPDOపై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు సుదర్శన్ రెడ్డిని ప్రజల ముందే చొక్కా పట్టుకుని పోలీసు అధికారి ఈడ్చుకెళ్లడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో వైఎస్సార్సీపీ మండలస్థాయి నేత సుదర్శన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇష్టారాజ్యంగా అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం అతడి తల్లి పద్మావతమ్మ గాలివీడు మండలం ఎంపీపీగా ఉన్నా సరే ఎంపీడీవో కార్యాలయంలో పెత్తనమంతా సుదర్శన్ రెడ్డిదే. తరచూ అనుచరులతో కార్యాలయానికి రావడం విందులు, చిందులతో కాలక్షేపం చేసి వెళ్లడం ఇలా వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా సాగాయి.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేత - ఎంపీపీ గది తాళాలివ్వలేదని ఎంపీడీవోపై దాడి
వైఎస్సార్సీపీ పాలనలో అధికారులూ అడ్డు చెప్పలేక మిన్నకుండి పోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారుల్లో చలనం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం MPDO కార్యాలయానికి వెళ్లి MPP గదిలో సేద తీరేందుకు సుదర్శన్‌రెడ్డి యత్నించాడు. గది తాళాలు తీసుకురావాలని అనుచరులకు తెలియజేశాడు. వాళ్లకు MPDO తాళాలు ఇవ్వలేదు. సుదర్శన్ రెడ్డి నేరుగా MPDO వద్దకు వచ్చి తాళాలు అడిగాడు. MPP లేకుండా ఇతరులకు గది తాళాలు ఇవ్వడం కుదరదని MPDO జవహర్‌బాబు సమాధానం ఇచ్చారు.
ఆ సమాధానాన్ని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి బలంగా ఎంపీడీవో పై దాడి చేశాడు. అతడి అనచురులూ మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. కింద పడేసి కొట్టారు. కుర్చీలతో దాడి చేశారు. చేతులు విరిచి పట్టుకున్ని గుండెలమీద తన్నారు. కాళ్లు, చేతులతో ఇష్టారీతిన అధికారిపై దాడికి పాల్పడి బలవంతంగా తాళాలు లాక్కుని ఎంపీపీ గదిలో అరగంట పాటు కూర్చున్నారు.
కడపకు పవన్ - వైఎస్సార్సీపీ నేత దాడిలో గాయపడ్డ ఎంపీడీవో పరామర్శ
దాడి జరుగుతున్న సమయంలో అడ్డొచ్చిన జవహర్‌బాబు మేనల్లుడుని, అటెండర్ నూ కొట్టారు. నిశ్చేష్టుడైన ఎంపీడీవో చేసేది లేక నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. అనంతరం సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు కేకలు వేసుకుంటూ బూతులు తిట్టారు. అస్వస్థతకు గురైన ఎంపీడీవోకు స్థానిక వైద్యులు ప్రథమ చికిత్సలు చేసి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందన్న జవహర్‌బాబు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీడీవోకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ఆర్డీవో శ్రీనివాసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం ఆసుపత్రికి వెళ్లి ఎంపీడీవోను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం ఎంపీడీవోను కడమ రిమ్స్‌కు తరలించారు.
వేట్లపాలెంలో దారుణం - కత్తులతో వెంబడించి ముగ్గురి హత్య
దాడి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో కూర్చున్న సుదర్శన్ రెడ్డిని సీఐ కొండారెడ్డి చొక్కా పట్టుకుని లాక్కెళ్లి పోయారు. ప్రజలంతా చూస్తుండగా చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొట్టుకుంటూ వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని జీపులో లాక్కెళ్లి పోవడం జనం ఆసక్తిగా తిలకించారు. పోలీసు అధికారులు ఇంత ధైర్యంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మొత్తం 20 మంది తనపై దాడి చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిగిలిన వైఎస్సార్సీపీ శ్రేణుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వ అండ దండలతో ఆ మండలంలో చెలరేగి పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పదిహేనేళ్ల కిందట ఎంపీడీవో ప్రతాప్ పైనా సుదర్శన్ రెడ్డి దాడి చేశాడు. అప్పుడు జెడ్పీటీసీగా ఉన్న సుదర్శన్ రెడ్డి తన మాట వినలేదని MPDOపై దాడి చేసినా చర్యలు లేవు. సుదర్శన్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.
పోలీస్ వాహనంపై దొంగనోట్ల ముఠా దాడి - కారును ఢీకొట్టి నిందితుడితో పరార్