Sub Registrar Signed Document at Tea Hotel in Kadiri : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయాల్సిన సంతకాలను ఓ అధికారి టీ దుకాణంలో చేయడం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ప్రజలకు సంబంధించిన దస్తావేజులను పట్టణ శివారులోని ఓ టీ షాపులోకి తెప్పించుకుని అక్కడే సంతకాలు చేయడం విమర్శలకు దారి తీసింది.
శుక్రవారం రోజున ఆయన సెలవులో ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ విలువ పెరిగిన దృష్ట్యా నిన్న (శుక్రవారం) క్రయ, విక్రయాల కోసం ఎక్కువమంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. సుమారు 130కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన సెలవులో ఉంటూనే దళారీల ద్వారా బయటకు దస్త్రాలను తెప్పించుకొని మరీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
హోటల్లో దస్తావేజులపై సంతకాలు చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం కదిరి కార్యాలయానికి సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు రాలేదు. శుక్రవారం ఆయన సెలవులో ఉన్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. సెలవులో ఉంటూనే హోటల్లో సంతకాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ప్రజలకు అలర్ట్ - నేటి నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్నేహపూర్వక సేవలు అందించడమే లక్ష్యం: ఆర్పీ సిసోదియా