APSRTC Sankranti Special Buses 2025 : సంక్రాంతి పండగ వస్తోందంటేనే ఒక సంతోషం, ఒక సరదా, ఒక ఆనందం, ఒక ఉత్సాహం. పండగ ముగిసిందంటే అయ్యో అనిపించినా అందమైన జ్ఞాపకాలెన్నో మిగులుస్తుంది. ఇది చల్లచల్లటి వాతావరణంలో నులివెచ్చటి సరదాల దొంతర. రంగురంగుల హరివిల్లులతో తీర్చిదిద్దిన లోగిళ్లు, పసుపు కుంకుమలు వేసిన గొబ్బెమ్మలు, పిండి వంటల ఘుమఘుమలు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు.
భోగిమంటలు, భోగిపళ్లు, కొత్తబట్టలు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, చెడుగుడు పోటీలు, పశువుల పందాలు ఒకటేంటి ఇల్లంతా, ఊరంతా ఒకటే హడావుడి. సంస్కృతీ సంప్రదాయాలకి మూలమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ ఏకంచేసే పండగ సంక్రాంతి. సంవత్సరమంతా సుఖసంతోషాలను, శాంతిని పంచుతుంది. అందుకే ఎవరెక్కడున్నా కుటుంబసభ్యులందరినీ ఒక చోటుకు చేరుస్తుంది.
మరి అలాంటి సంక్రాంతి పండగ ప్రయాణాలు అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు. ఇందుకోసం సొంతూళ్లకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటి వారికి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయి : రెగ్యులర్ బస్సులకు ఇవి అదనమని, ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవనీ రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో రద్దీని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కొన్ని మార్పులు చేసినట్లు పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్ బస్సుల్ని ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడిపించనున్నట్లు వివరించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వెల్లడించింది.
ఆ పుంజు స్పెషల్ - రేటు తెలిస్తే షాక్
ధను సంక్రాంతి రోజు ఇలా పూజ చేస్తే చాలు- ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఖాయం!