ICAI CA Final Results: చార్టెర్డ్ అకౌంటెంట్(CA) ఫైనల్ పరీక్షల రిజల్ట్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. నవంబరులో జరిగిన సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాలలో హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరి హేరంబ్తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలమనేరుకు చెందిన రిషబ్ ఓజ్వాల్ ఆర్ ఇద్దరూ 600కి గాను 508 మార్కులు (84.67%) సాధించి ఫస్ట్ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా సీఏ ఫైనల్ పరీక్షల్లోని గ్రూపు-1, 2 రాసినవారు 30,763 మంది ఉండగా, వారిలో 4,134 మంది (13.44%) ఉత్తీర్ణత సాధించారు. గ్రూపు-1 మాత్రమే రాసిన 66,987 మందికిగాను 11,253 మంది (16.80%), గ్రూపు-2 మాత్రమే రాసిన 49,459 మందికిగాను 10,566 మంది(21.36%) ఉత్తీర్ణులయ్యారు.
ముందు నుంచే ప్రిపరేషన్: ఐసీఏఐ (the institute of chartered accountants of india) విడుదల చేసిన సీఏ ఫైనల్ ఫలితాల్లో పలమనేరుకు చెందిన రిషబ్ ఓజ్వాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. 600కు 508 మార్కులు సాధించిన ఇతను సీఏ-ఐపీసీసీ గుంటూరులో చదివి ఆల్‌ఇండియా ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. 2020వ సంవత్సరంలో సీఎంఏ ఫౌండేషన్‌లో, 2021లో సీఎంఏ ఇంటర్‌లోనూ ఆల్‌ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం విశేషం. యువకుడు చిత్తూరు జిల్లాలోనే పదో తరగతి వరకు చదివాడు. ఐపీసీసీ (Integrated Professional Competence Course) అనంతరం ఆర్టికల్స్ చేసే సమయం నుంచే ఫైనల్స్‌కు సిద్ధమవుతూ క్రమం తప్పకుండా రివిజన్ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని రిషబ్ పేర్కొన్నారు. రిషబ్ తల్లిదండ్రులు రాజేష్, సుమిత్ర వ్యాపారులు.
రిషబ్ మా విద్యార్థే: సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ ఓజ్వాల్ జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించినట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేట కాలేజీ క్యాంపస్‌లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రిషబ్ ఇంటర్మీడియట్ నుంచి మాస్టర్ మైండ్స్‌లోనే చదివినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల్లో తమ విద్యార్థులు ముంజులూరి మోహన్‌కృష్ణ జాతీయస్థాయి 33వ ర్యాంకు, కేసన సాయిచరణ్ 34వ ర్యాంకు, కాకుమాను కృష్ణచైతన్య 40వ ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.