Nara Bhuvaneswari on Euphoria Musical Night Program: సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ నినాదంతోనే ట్రస్టు కార్యక్రమాలు సాగుతున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ వివరాలను ఆమె వెల్లడించారు. రక్తహీనత వల్ల తలసేమియా బాధితులు పడే ఇబ్బందుల్ని తొలగించేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధిన పడుతూ ఊపిరి తీసుకోవటానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె, బ్లడ్ ట్రాన్స్మిషన్కు కూడా రక్తం ఎంతో అవసరమని తెలిపారు.
ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరినీ రక్తదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు. రక్తదానం వల్ల ఇతర జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అన్నారు. సమాజహితం కోసం కార్యక్రమం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా తమన్ అంగీకారం తెలిపారన్నారు. తెలుగుతల్లికి రుణం తీర్చుకునే అవకాశంగా ప్రతి ఒక్కరూ భావించి సమాజ సేవలో పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
నారా భువనేశ్వరి ఆసక్తికర సమాధానాలు: అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నారా భువనేశ్వరి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మ్యూజికల్ నైట్‌కు సీఎం లేదా భద్రతా సిబ్బంది ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందేనని అన్నారు. కుటుంబానికి రూ.6 లక్షలతో చంద్రబాబే టికెట్లు కొని టేబుల్ బుక్ చేశారని తెలిపారు. హెరిటేజ్, ట్రస్టు కోసం ఏదైనా చేస్తామంటే చంద్రబాబు అంత తేలిగ్గా ఒప్పుకోరని పేర్కొన్నారు. ఎవరి కాళ్లపై వాళ్లే నిలబడాలని చంద్రబాబు అనేవారని, ట్రస్టు కార్యక్రమాలపై ఆయనను తానేమీ అడగనని స్పష్టం చేశారు.
పవన్‌కల్యాణ్ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నా: చంద్రబాబును అడిగినా వెంటనే అంగీకరించరని అన్నారు. పదవులు వస్తాయ్, పోతాయ్ అని, తాను మాత్రం భువనేశ్వరినే అని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ను కూడా మ్యూజికల్ నైట్‌కు ఆహ్వానించామని తెలిపారు. మ్యూజికల్ నైట్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నానన్నారు. సమాజానికి తిరిగి ఇద్దాం అనే నినాదంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు.
తలసేమియా బాధితుల సహాయార్థం ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ చేపట్టనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, డ్రమ్స్ ఆర్టిస్ట్ శివమణి లైవ్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. మ్యూజికల్ నైట్ నిర్వహణ ద్వారా వచ్చే డబ్బు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఖర్చు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. సమాజానికి తిరిగి ఇద్దాం అనే మంచి ఆలోచనతో చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కోరారు.
తలసేమియా వ్యాధిని రాష్ట్రం నుంచి పారద్రోలేలా చేసేందుకు చేపట్టే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామన్నారు. రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే, భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారన్నారు. షో టిక్కెట్ కోసం ఖర్చు చేసే ప్రతీ రూపాయి తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థమే ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీలో మునుపెన్నడూ జరగని విధంగా 50మందికి పైగా నిపుణులతో విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తమన్ వెల్లడించారు.
తలసేమియా బాధితులకు అండగా NTR ట్రస్ట్ - విజయవాడలో తమన్ మ్యూజికల్ నైట్