Vijayawada West Bypass Phase-3 Works To Be Complete Shortly : విజయవాడ నగరవాసుల దశాబ్దాల కల సాకారం కాబోతోంది. ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఎన్నో ఏళ్లుగా పడుతున్న నరకయాతన నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్ దాదాపు పూర్తి కావొచ్చింది. అధునాతన బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.
విజయవాడ పశ్చిమ బైపాస్ : విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వారికి త్వరలోనే ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది. అమరావతిని దేశంలోని పలు ప్రాంతాలకు అనుసంధానించడం కోసం 2014లో అప్పటి టీడీపీ సర్కార్ గన్నవరం దగ్గరలోని చిన్నఅవుటపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్‌గేట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 47.8 కిలోమీటర్ల దూరం గల ఈ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేసింది. ఆరు వరసల రహదారి కోసం టీడీపీ సర్కార్ డీపీఆర్ రూపొందించి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో ఆమోదింపజేసింది.
95 శాతం పనులు పూర్తి : ఈ బైపాస్‌ను కేంద్రం భారత్ మాల ప్రాజెక్టు కింద చేర్చి NHAIకి రోడ్డు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. రెండు ప్యాకేజీలుగా విభజించి NHAI ప్రఖ్యాత నిర్మాణ సంస్థలకు పనులు అప్పజెప్పింది. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్‌ను ప్యాకేజీ-3గా చేసి నిర్మాణ బాధ్యత మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టింది. గొల్లపూడి నుంచి కాజా టోల్‌గేట్ వరకు మరో 17.8 కిలోమీటర్ల మార్గాన్ని ప్యాకేజీ-4 గా నిర్ణయించి నవయుగ, అదానీ గ్రూప్‌లకు అప్పగించింది. 2021లో పనులు చేపట్టిన నిర్మాణ సంస్థలు శరవేగంగా జరిపాయి. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మార్గం 95 శాతం పూర్తిచేసింది.
పెరుగుతున్న భూముల ధరలు : విజయవాడ పశ్చిమ బైపాస్ ప్యాకేజీ-3 పనులు రూ.1148 కోట్లతో చేస్తున్నారు. పలు గ్రామాల సమీపం నుంచి వెళ్లే రహదారిలో ట్రాఫిక్ జామ్‌కు తావు లేకుండా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వాహనదారులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా భద్రతా చర్యలు తీసుకున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో విజయవాడ శివారు ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో నున్న, జక్కంపూడి కాలనీ, కొండపావులూరు, వెదులు పావులూరు గ్రామాల వైపు వెళ్లేందుకు విజయవాడ నుంచి సరైన మార్గం లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికావడం, గ్రామాలకు అనుసంధానిస్తూ స్పిట్ రోడ్లు నిర్మించడంతో ఈ మార్గం వెంట రియల్‌ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు సైతం పెద్దఎత్తున భూములు కొనుగోలు చేయడంతో పొలాల ధరలు కూడా పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి : చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యలో హైటెన్షన్ విద్యుత్ టవర్లు అడ్డు రావడంతో వాటిని తొలగిస్తున్నారు. 5 చోట్ల అండర్‌పాస్ బ్రిడ్జి పనులు వేగంగా చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇక ఆ బైపాస్‌పై వాహనాలు రయ్రయ్ - ఏప్రిల్ నాటికి పాక్షికంగా అందుబాటులోకి!
ఆ రెండు రోడ్లు పూర్తయితే దూసుకుపోవడమే! - విజయవాడ తూర్పు బైపాస్ ఎక్కడినుంచి వెళ్తుందంటే!