Easy Breakfast Recipe Rava Uttapam : సమయం దొరకడం లేదా? అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ రెడీ చేయాలనుకుంటున్నారా? అయ్యో రాత్రి ఏమి నానపెట్టలేదు, మిక్సీ పట్టలేదు కదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే Instant Rava Uttapam రెసిపీ మీ కోసం సిద్ధంగా ఉంది. దీని తయారీ కూడా పెద్ద కష్టమేమీ కాదు. పట్టుమని పది నిమిషాల్లో ప్లేట్ లోకి వచ్చేస్తుంది!
దోశె మాదిరిగా ఉండే ఊతప్పం అంటే చాలా మందికి ఇష్టం. ఆఫీసుకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడినపుడు, లేదంటే స్కూల్ పిల్లల బ్రేక్ ఫాస్ట్ కోసం దీనిని అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. హోటళ్లలో రుచి చూడడం తప్ప ఇంట్లో ఎన్నడూ దీనిని ట్రై చేయని వారు సైతం ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం! వెంటనే ఊతప్పం చేసేద్దాం పదండి.
'90's కిడ్స్' ఫేవరెట్ ఐటమ్ ఇది - ఈ తరం పిల్లలకు మీ చేతులతో తయారు చేసి పెట్టండి
ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు :
- బొంబాయిరవ్వ - 1 కప్పు
- అటుకులు - అర కప్పు
- పెరుగు - అర కప్పు
- ఉప్పు - 1 టీ స్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- చిన్న ఉల్లిపాయ తరుగు
- పచ్చిమిరపకాయలు- 3
- అల్లం - తరుగు
- కరివేపాకులు - 2 రెబ్బలు
- ఉప్పు - పావు టీస్పూన్
- ఇంగువ - చిటికెడు
- తురిమిన క్యారెట్లు - 2
- కొత్తిమీర - తరుగు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం :
- ఊతప్పం పిండి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద గిన్నెలో బొంబాయి రవ్వ, నానపెట్టిన అటుకులు కలుపుకోవాలి. అందులో పెరుగు, ఉప్పు వేసుకుని మిశ్రమానికి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టాలి.
- తరువాత చిన్న కడాయిలో నూనె, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి.
- ఆవాలు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. అవి వేగాక కరివేపాకు, ఉప్పు, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. చివరగా క్యారెట్ల తురుము వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి.
- పిండి, పోపు మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్నాక పాన్ తీసుకుని వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని దోశెకు కొంచెం తక్కువ సైజులో మందంగా పోసుకోవాలి. దానిపై వేయించి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమం, పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరి. దాని చుట్టూ నెయ్యి లేదా నూనె కొద్దిగా వేసుకుని మూత పెట్టి నిమిషం పాటు కాల్చుకోవాలి.
- నిమిషం తరువాత మూత తీసేని ఊతప్పం తిరగేసి రెండోవైపు కూడా కాల్చుకుంటే ఉత్తాపం రెడీ అయినట్టే.
రొటీన్ కాదు 'ప్రొటీన్'గా చేసేద్దామా! - 'బరువు తగ్గించే దోశలు'
గుడ్లు లేకుండానే టేస్టీ 'ఎగ్ బుర్జీ'! - సింపుల్ టిప్స్‌తో ఇలా చేసేయండి