Singareni Coal Mines Transportation Issues 2024 : సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. వానకాలం వస్తున్నందున బొగ్గు ఉత్పత్తి తగ్గుతుంది. రెండు సంవత్సరాలుగా దేశంలో వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగినంత లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని గనుల నుంచి అత్యవసరంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు తరలించాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
కేంద్రం ఆదేశాలతో సింగరేణికి ఇబ్బందులు : ఈ ఆదేశాలను అమలు చేయడానికి సింగరేణి ఇబ్బందులు పడుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి గనుల వద్ద 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గనుల తవ్వకం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉత్పత్తయ్యే బొగ్గులో 40 శాతం నిర్వాసితులు, స్థానికుల వాహనాల ద్వారా తరలిస్తామని సింగరేణి పేర్కొంది. ఈ నిబంధన వల్ల ప్రస్తుతం రోజుకు సగటున 10,000ల టన్నులకు పైగా స్థానిక లారీల యజమానులు పలు ప్రైవేట్ పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు.
కానీ ఇప్పుడు బొగ్గు మొదట విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో స్థానికుల లారీల ద్వారా రవాణాను సింగరేణి నిలిపివేసింది. ఎందుకంటే గనుల నుంచి రుద్రంపూర్‌లో గల రైల్వే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు బొగ్గు పంపడానికి టిప్పర్లు అవసరం. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు చేర్చితేనే అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గును పంపడానికి వీలవుతుంది. టిప్పర్ల నుంచి నేరుగా గూడ్స్ వ్యాగన్లలో ఎత్తిపోయవచ్చు.
Singareni Coal Mines in Telangana :అయితే సత్తుపల్లి స్థానికులకు టిప్పర్లు లేకపోవడంతో సంస్థ, వారి లారీల ద్వారా రవాణాను నిలిపివేసింది. దీనిపై లారీల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ప్రాంతంలో చూస్తే, గని నుంచి బొగ్గు తరలించడానికి సింగరేణి లారీల కిరాయి నిర్ణయించడానికి టెండర్లు పిలిచింది. కిలోమీటరుకు రూ.3.29 చొప్పున చెల్లిస్తే తరలిస్తామని ఒక వ్యాపారి టెండర్ వేయగా సంస్థ ఆమోదించింది. ఇదే ధరకు తరలించడానికి స్థానిక లారీల యజమానులకు కూడా అవకాశం ఇవ్వడానికి ఆ వ్యాపారి ముందుకొచ్చారు. కానీ గతంలో కిలోమీటరుకు రూ.4.20 చొప్పున చెల్లించారని లారీల యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు తగ్గిస్తే ఒప్పుకొనేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.