QR Code Scam In Hyderabad :ఓ సంస్థకు చెందిన డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన 'క్యూఆర్ కోడ్' మార్చేసి రూ.4.15 కోట్లు కాజేశారు ప్రబుద్ధులు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ఆ సంస్థలోనే పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. సంస్థ సేవలను పొందిన కస్టమర్లు డబ్బు చెల్లించే క్రమంలో అసలు 'క్యూఆర్ కోడ్' బదులు వ్యక్తిగత కోడ్ ఉపయోగించి సొమ్మును కాజేసినట్లు తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే? : హైదరాబాద్ కొండాపూర్‌లో 'ఇస్తారా పార్క్స్ ప్రైవేట్' లిమిటెడ్ సంస్థ ఆతిథ్యరంగానికి సంబంధించి సేవలు అందిస్తోంది. ‘కోలివింగ్ ప్రాపర్టీస్’ పేరుతో నగరంలో ఒంటరిగా ఉండే ఉద్యోగుల కోసం అద్దె గృహాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఫుడ్ కోర్టులున్నాయి. నగర పరిధిలో కోలివింగ్ ప్రాపర్టీస్‌లో పనిచేసే ఉద్యోగులు, వినియోగదారులు డిజిటల్ విధానంలో చెల్లించే సొమ్మును సంస్థ 'క్యూఆర్ కోడ్' ద్వారా మాత్రమే స్వీకరించాలి. ఇవి నేరుగా సంస్థ బ్యాంకు ఖాతాలో జమవుతాయి. చెంగిచెర్లకు చెందిన యసిరెడ్డి అనిల్‌కుమార్, సికింద్రాబాద్ వాసి మందల రాజ్‌కుమార్ ఈ సంస్థలో గతేడాది మార్చి నుంచి ఫ్లోర్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు.
అద్దె గృహాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ వినియోగదారుల నుంచి డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరిస్తోంది. ఇందుకోసం అన్నిచోట్లా 'క్యూఆర్‌కోడ్'లు ఏర్పాటు చేసింది. ఎలాగైనా డబ్బు కాజేయాలని పథకం వేసిన అనిల్, రాజ్ సంస్థ క్యూఆర్ కోడ్‌లను మార్చేశారు. ఇస్తారా స్థానంలో ఇస్తరా, ఇస్తా పేరుతో ఉండే క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో వినియోగదారులు చెల్లించిన సొమ్మంతా సంస్థ ఖాతాలకు బదులు అనిల్, రాజ్‌కుమార్ వ్యక్తిగత ఖాతాల్లో జమయ్యేవి. ఇలా అనిల్ ఒక్కడే రూ.2 కోట్లు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.