Ganja Gang Arrested in Hyderabad :హైదరాబాద్ రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద మంగళవారం రోజున గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 89 లక్షల 90 వేల విలువ గల 254 కిలోల గంజాయితో పాటు 2 కార్లు, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని అరకులో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ మీదుగా యూపీకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సచిన్‌సింగ్ తో పాటు నదీమ్, సక్లైన్, సలీం, ప్రశాంత్ వీరంతా యూపీ, ముంబయికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటను గురించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ "5 ఏళ్లుగా ఏపీ టు యూపీకి ఈ మత్తు దందా సాగుతున్నట్లు తేలింది. ముందు ఒక పైలెట్ వాహనం పెట్టి దారి సాఫీగా ఉందనుకుంటేనే వెనుక నుంచి గాంజా ఉన్న కారు ముందుకు వెళ్తుంది. ప్రధాన నిందితుడు సచిన్ సింగ్ వద్ద ఒక పిస్టల్ తో పాటు బుల్లెట్లు ఉన్నాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాం. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఎలాంటి కాల్పులు జరగలేదు." అని తెలిపారు.