Two Crore Rupees Fraud By Village People Aadhar Cards :సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో చిన్న మల్లయ్య అనే వ్యక్తి గ్రామస్థులను నమ్మించి వారి పేరు మీద లోన్లు తీసుకుని బురిడీ కొట్టించాడు. దాదాపు 270 మంది పేరు మీదు పలు బ్యాంకుల్లో లోన్ తీసుకుని రూ.2 కోట్లతో ఉడాయించాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, మాడుగుల చిన్న మల్లయ్య భార్య నాగలక్ష్మి ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు మొత్తం చిన్న మల్లయ్య చూసుకునేవారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు క్రమం తప్పకుండా కల్పించి, గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పేద ప్రజలకు బ్యాంకులో లోన్ కూడా ఇప్పించాడు.
ఇలా గ్రామస్థులను నమ్మించిన చిన్న మల్లయ్య, అదే అదునుగా పేద ప్రజల ఆధార్ కార్డు సహాయంతో బ్యాంకుల వద్ద లోన్ తీసుకున్నాడు. ప్రతి వ్యక్తి పేరున మూడు నుంచి నాలుగు ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకోగా, వారాంతపు, నెల రోజులకు కట్టే పొదుపులు కూడా తీసుకున్నాడు. అవే కాకుండా సమభావన సంఘం పేరున 10 మందిలో ఆరుగురివి కూడా తానే తీసుకున్నాడు. ఇలా వివిధ రకాలుగా సుమారు బూరుగడ్డ, మాచారం గ్రామాల్లో 270 మంది పేరున లోన్లు తీసుకున్నాడు. అమాయక ప్రజలనే టార్గెట్ చేస్తూ ఎంతోమందిని బురిడీ కొట్టించిన చిన్న మల్లయ్య, మూడు నెలల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేసుకుని ఉడాయించాడు.