Two Burnt Alive in Car Fire in Medchal : కారులో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమైన ఘటన కేసు అనూహ్య మలుపు తీసుకుంది. యువతి, యువకుడు కావాలనే కారులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మృతులను శ్రీరామ్, లిఖితగా పోలీసులు గుర్తించారు. అప్పటి వరకూ కారులో మంటలు చెలరేగి చనిపోయారని భావించిన పోలీసులు దర్యాప్తు చేసి వారిది ఆత్యహత్యగా తేల్చారు. ఇరుకుటుంబాల పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని అందుకే యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
బయటపెట్టిన 3 పేజీల లేఖ : ఘటనాస్థలంలో దొరికిన 3 పేజీలు లేఖతో ఈ విషయం బయటపడింది. అలాగే తాము చనిపోతున్నామని తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. శ్రీరామ్ స్వస్థలం యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం జమ్ములపేట కాగా, లిఖితది మేడ్చల్ జిల్లాలోని నారపల్లి అని పోలీసులు తెలిపారు.
ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఘట్కేసర్ పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో కారులో ప్రేమజంట నిప్పంటించుకుని మరీ ఈ దుర్ఘటనకు పాల్పడింది. దీంతో కారులో ఇద్దరు సజీవదహనం అయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.