A Beggar Killed in Medak District : మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మతి స్తిమితం కోల్పోయి, ఓ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడి చేసి అతనిని హతమార్చారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక గ్రామస్థుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో 35 నుంచి 40 ఏళ్ల మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఉన్నాడు. అతను నెల రోజులుగా భిక్షాటన చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. ఆ వ్యక్తి హిందీ మాట్లాడుతూ రోడ్డు పక్కన, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఈ నెల 4న రోడ్డు పక్కన బస్టాండులో నిద్రిస్తుండగా, దొంగతనం చేశాడనే నెపంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి తిరుపతిరెడ్డి, పందికొక్కుల మణికంఠ గౌడ్లు అతనిపై అమానవీయంగా దాడి చేశారు.
కొట్టొద్దంటూ సదరు వ్యక్తి ఎంత ప్రాధేయపడినా అతడిని విడిచిపెట్టలేదు. రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి అతడిపైకి బైక్ ఎక్కించారు. అంతటితో ఆగకుండా పైకెత్తి పడేశారు. బైకుకు కట్టి ఈడ్చుకెళ్లారు. కొట్టొద్దని కాళ్లావేళ్లాపడినా కనీసం కనికరించలేదు. చివరకు ఓ చోటుకు తీసుకెళ్లి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం అంతా అక్కడ బస్టాండ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ నెల 5న ఉదయం అతని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రక్షకభటులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాన్ని ఈ నెల 6న నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తీసుకెళ్లి పరీక్షలు చేయించి మృతదేహాన్ని ఖననం చేశారు.
రాజకీయ ఒత్తిళ్ల వళ్లే అరెస్టు చేయలేదు : పోలీసుల దర్యాప్తులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన వ్యక్తిని దాడి చేస్తున్నట్లు బస్టాండ్ సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన తీవ్ర జాప్యం చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణకు తీసుకెళ్లినా ఓ ప్రజాప్రతినిధి, నాయకుల ఒత్తిళ్లుతో ఇంటికి పంపించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదో తేదీన ఘటన వెలుగులోకి వస్తే 9వ తేదీన నిందితులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ జాప్యం వారిని వదిలేయడానికే జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారనే వార్తలు వినిపిస్తున్నాయి తప్పా వారి గురించి పూర్తి సమాచారం బయటకు రాకపోవడం చర్చనీయాంశం అయింది.
నిందితుల పూర్తి వివరాలు వెల్లడించలేదు : మణికంఠగౌడ్ స్థానికంగా ఓ ప్రజాప్రతినిధికి చెందిన యువజన విభాగంలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. తిరుపతిరెడ్డి గ్రామంలో ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తూప్రాన్‌లో సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయినా నిందితుల పూర్తి వివరాలు వెల్లడించకపోవడం విమర్శలకు తావిస్తోంది.