తెలంగాణ

telangana

తిరుపతి లడ్డూ వివాదం - ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించనున్న టీటీడీ ఈవో - Tirupati Laddu Controversy In AP

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Tirupati Laddu Ghee Controversy : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నివేదిక అందించనున్నారు. కాగా టీటీడీ అధికారులతో అత్యవసరంగా సమావేశమైంది.

Tirupati Laddu Ghee Controversy
Tirupati Laddu Ghee Controversy (ETV Bharat)

Tirumala Laddu Issue Updates : ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం స్పందించిన సీఎం చంద్రబాబు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు.

అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ : ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుమల దేవస్థాన పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణ అంశంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో నివేదిక కీలకంగా మారనుంది. శనివారం సాయంత్రం ఆయన సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఈవో నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. ఈ వ్యవహారంపై ఆగమ, వైదిక శాస్త్ర పండితులతో పాటు ధార్మిక పరిషత్‌ పెద్దలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తిరుమల ఆలయశుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. ధార్మిక పరిషత్‌ పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారంపై దేవాదాయశాఖ కూడా అప్రమత్తమైంది.

తిరుమల లడ్డూ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు :తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఘటన నేపథ్యంలో తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని వైఎస్సార్సీపీ నేతలు అపవిత్రం చేశారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. ఇందులో భాగంగా జగన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారని మండిపడ్డారు. ఆలయాన్ని, పోటును సంప్రోక్షణ చేయాలని తెలిపారు. కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ ఈవో ధర్మారెడ్డి కీలకమని చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ఛైర్మన్‌, టీటీడీ ఉన్నతాధికారులను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

ఘోర అపచారం : తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమే - వైసీపీ అరాచకాలపై విస్తుపోతున్న శ్రీవారి భక్తులు - Tirupati Laddu Updates

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదు : ఏఆర్‌ డెయిరీ - AR Dairy on TTD Laddu Controversy

ABOUT THE AUTHOR

...view details