Vanasthali National Park : కొందరు కబ్జాదారులు ఏకంగా జాతీయ పార్కునే విక్రయించారు. తక్కువ ధరకే స్థలాలిస్తామంటూ మోసాలకు పాల్పడి, కోట్ల రూపాయలను జేబుల్లో వేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. అదే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని వనస్థలిపురం వద్ద ఉన్న జాతీయ పార్క్ హరిణ వనస్థలి. దీనికై కొత్త అంశాలు సైతం వెలుగు చూస్తున్నాయి.
కొందరు నాలుగైదేళ్లుగా పార్కు స్థలాన్ని తొంభై గజాలు, అరవై గజాలు చొప్పున విక్రయిస్తున్నారని రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. యూనస్ ఖాన్, సుల్తానాలు తక్కువ ధరలకే స్థలాలిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే వేల మందికి ఈ స్థలాన్ని విక్రయించారని, అసలు ఈ హరిణ వనస్థలి జాతీయ పార్కు 582 ఎకరాలుంటే, నాలుగింతలు అంటే 2,400 ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు చేశారని వారు ఆధారాలు సేకరించారు.
తప్పుడు పత్రాలు సృష్టించి యథేచ్ఛగా ఆక్రమణ : హరిణ వనస్థలి పార్కున్న ప్రాంతమంతా ప్రైవేటు పట్టాభూములదంటూ కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించారు. 1336 ఫసలీ రికార్డుల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హనీఫాబీ అనే మహిళను ప్రభుత్వ భూములకు కస్టోడియన్‌గా నియమించిందన్నారు. ఈ భూముల్లో కొన్నింటిని అటవీశాఖకు లీజుకు ఇచ్చారన్నారు. ఆ భూములను అటవీశాఖ అధికారులు వెనక్కి ఇవ్వకుండా వారే కబ్జా చేశారంటూ సదరు వ్యక్తులు ఈ పత్రాలను కొనుగోలుదారులకు చూపించి, విక్రయిస్తున్నారు.
జాతీయ పార్కులోని పార్కులోనూ, పార్కు వెలుపల స్థలమంతా తమదేనంటూ కొనుగోలుదారులకు చెప్పేస్తున్నారు. 90 గజాల స్థలం రూ.35 వేలకు ఇస్తుండటంతో చాలా కొనుగోలు చేశారు. తక్కువ ధరకే స్థలం వస్తుందని వేల మంది అందులో స్థలాలను కొనుగోలు చేయగా, ఇలా రెండు, మూడేళ్లలోనే సుమారు యాభైవేల ప్లాట్లు విక్రయించినట్లు అటవీశాఖ అధికారులు చెప్పారు.
ముప్పైఏళ్ల క్రితమే జాతీయ పార్కు : వనస్థలిపురంలోని హరిణ వనస్థలి ఉద్యానం 30 ఏళ్ల క్రితమే జాతీయస్థాయి పార్కుగా రూపొందిందని రంగారెడ్డి జిల్లా అటవీశాఖాధికారి డి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థలాల గురించి అవగాహనలేని వారికి విక్రయించి రూ.కోట్లు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ మా స్థలంలోకి ఎవరూ రాలేదని, ఈనెల 26న పార్కులో జెండాలు ఎగురవేద్దామంటూ మహ్మద్ జిలానీ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశాడని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. దీంతో తాము పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన వివరించారు.
'వారం రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేయాలి'.. హనుమంతుడికి అధికారుల నోటీసులు