Tirumala SSD Tokens Issuance on January 23 : తిరుమల కొండపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని కనులారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలివస్తుంటారు. అలాగే, కాలినడక ద్వారా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం పలు సేవలను అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). అయితే, కొన్ని రోజులుగా తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం(ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఒక కీలక ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి గతంలో మాదిరిగా మళ్లీ ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ఉంటుందని పేర్కొంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఆగిపోయిన ఈ టోకెన్ల జారీని జనవరి 23 నుంచి మళ్లీ యధావిధిగా కొనసాగించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంటే రేపటి నుంచి శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తులు ఏరోజుకారోజు సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు పొందవచ్చు. తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే భక్తులు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను పొందవచ్చని తెలిపింది టీటీడీ. కాబట్టి, భక్తులు ఈ విషయాన్ని గమనించవల్సిందిగా కోరింది.
ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఎందుకు నిలిపివేశారంటే?
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. అయితే, ఆ తేదీల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు స్వామివారి దర్శనం లభించలేదు. దాంతో వారు ప్రస్తుతం పెద్దఎత్తున తిరుమలకుచేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రద్దీ తగ్గే వరకు సర్వదర్శనం భక్తులకు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి అనుమతిస్తున్నారు.