TGNAB Focus On Drugs Supply :మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తోంది. మాదకద్రవ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్రం నలువైపులా పోలీసులు, ఎక్సైజ్, నార్కొటిక్స్ బ్యూరో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఒక వైపు దాడులు నిర్వహిస్తునే మరో వైపు విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో ఆకస్మిక డ్రగ్స్ పరీక్షలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా టీజీన్యాబ్ చేపట్టిన తనిఖీల్లో రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జనవరి ఒకటిన డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పబ్‌ల్లో స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేపడుతున్నారు. తమ వద్ద ఉన్న కిట్స్‌తో వేడుకల్లో పాల్గొన్న వారి మూత్ర నమూనాలు తీసుకొని క్షణాల్లో డ్రగ్స్ తీసుకున్నారా, లేదా అని నిర్థారించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే తరహాలో విద్యాసంస్థల్లో మత్తు ఆనవాళ్లు పసిగట్టే ప్రయత్నం చేయనున్నారు. విద్యార్థుల తరగతులకు ఇబ్బంది కలగకుండా అత్యంత గోప్యంగా పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.
మత్తువలలో విద్యార్థులు : గంజాయి వినియోగించే వారిలో 4 వారాలు, కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకునేవారి శరీరంలో 3 నెలల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయి. పోలీసులు ఆకస్మికంగా జరిపే వైద్యపరీక్షల్లో మత్తుకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించి సాధారణ స్థితికి తీసుకురావచ్చని పోలీసు ఉన్నతాధికారుల భావిస్తున్నారు. విద్యాసంస్థల్లో మత్తుజాడలు చాపకిందనీరులా విద్యార్థులను కమ్మేశాయి. ఇటీవల కాలంలో టీజీన్యాబ్ పోలీసుల దాడుల్లో ఈ విషయం స్పష్టమైంది. అంతర్జాతీయ ప్రమాణాలున్నాయంటూ ఘనంగా ప్రకటించిన విద్యాసంస్థల్లో వందలకొద్దీ పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.