TS SSC 2024 Exams Begin on March 18 :రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం 9.30 కి పదోతరగతి పరీక్షలు ప్రారంభంగానున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11వేల 469 పాఠశాలలకు చెందిన 5లక్షల 8వేల 385 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో 2లక్షల57వేల 952 మంది బాలురు కాగా 2 లక్షల 50వేల 433 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 2676 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల(SSC Exams) నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. 30వేల మంది ఇన్విజిలేటర్లు పరీక్షా విధులు నిర్వర్తించనున్నట్టు ప్రకటించింది.
10 Th Class Public Exam Hall Tickets : దాదాపు పది రోజుల ముందు నుంచే హాల్ టిక్కెట్ల పంపిణీ ప్రారంభించిన విద్యాశాఖ విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేక డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ నుంచి హాల్ టిక్కెట్లు(Hall Tickets) డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించిది. హాల్ టిక్కెట్ పై పేరు, సబ్జెక్టు, భాష సహా విద్యార్థి సమాచారంలో తప్పులు ఉంటే తక్షణం ప్రధానోపాధ్యాయుల వద్ద సరిచేసుకోవాలని సూచించింది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు సాగనున్న పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు పరీక్ష సాగనుంది. అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి మార్కులు పక్కా
నిఘానేత్రాల పర్యవేక్షణలో పరీక్షలు
పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో సీసీటీవీకెమెరాలు ఏర్పాటు చేయటంతోపాటు.. మాల్ ప్రాక్టీస్ ని కట్టడి చేసేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించినట్టు పేర్కొంది. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ షాప్ లను ఎగ్జామ్స్ సమయంలో మూసివేయనున్నట్టు పేర్కొంది. మరోవైపు పరీక్షాకేంద్రాల తనిఖీ కోసం 144 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, సిట్టింగ్ స్క్వాడ్(Sitting Squad) లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను(Electronic Gadgets) తీసుకురావటానికి అనుమతి లేదని పేర్కొంది. ప్రతి కేంద్రంలో మంచినీరు అందించటంతోపాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్ లో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.