Minister Ponnam Prabhakar Review On TGSRTC : మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు తీసుకురాబోతున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న మహాలక్ష్మి పథకాన్ని నేటి వరకు 68.60 కోట్ల మంది మహిళలు వినియోగించుకుని, రూ.2350 కోట్లను ఆదా చేసుకున్నారని ఆయన తెలిపారు.
సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో చేస్తుండటం వల్లే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు. హైదరాబాద్ బస్ భవన్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనితీరుపై రవాణాశాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
Retired Employees to Expand Cargo Services : అనంతరం క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తోన్న కండక్టర్లు, డ్రైవర్లతో వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. మహబుబాబాద్, హయత్ నగర్ -2, నిజామాబాద్-2, అసిఫాబాద్, హుస్నాబాద్, నారాయణపేట, మిర్యాలగూడ, మధిర, సిద్ధిపేట, సంగారెడ్డి డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా ముచ్చటించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలకు ప్రయాణికులకు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు 38 డిపోలు లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్గో సేవలను విస్తరించేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు.