TRANSCO Employees Helping Chenchu Tribe :అడవిది, ఆదివాసీలది విడదీయరాని బంధం. పుట్టుక నుంచి చావు వరకు జీవితం అంతా అడవి మాత్రమే వారి ప్రపంచం. బయటి లోకంతో ఏమాత్రం సంబంధం లేని బతుకులు వారివి. రాష్ట్రంలో ఆదివాసీలు అంటే ప్రధానంగా గుర్తుకువచ్చే వారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవుల్లో నివసించే చెంచులు. అందరు అడవి పుత్రుల లాగానే నాగరిక ప్రపంచానికి దూరంగా, కనీస సౌకర్యాలు లేని వీరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు ట్రాన్స్‌కో అధికారి వీరబాబు, ఆయన సహచర బృందం.
Nallamala Chenchu Tribes :ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన వీరబాబు నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్‌కు బదిలీ అయ్యారు. అక్కడి అటవీ ప్రాంతంలో చెంచులు విద్య, వైద్యం సహా ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా పడుతున్న ఇబ్బందులను ఆయన దగ్గర నుంచి గమనించారు. వారి కష్టాలను వీరబాబు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించారు. అప్పటికే సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపులో ఈ విషయాన్ని తెలియజేశారు. అంతే చేయి చేయి కలిసింది. ట్రాన్స్‌కో అధికారుల బృందం అంతా ఒక్కటై చెంచులకు కావాల్సినవి అన్నీ తమ వంతుగా సమకూరుస్తున్నారు.
Chenchus Life Style In Nallamala : నల్లమలలో ఒకరోజు.. గిరిపుత్రులతో గడిపేద్దాం రండి
నల్లమల్లలోని అమ్రాబాద్ రక్షిత అడవులు అంటే కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన దట్టమైన కీకారణ్యం, అందులో విసిరేసినట్టు ఉండే చెంచు గ్రామాలే. నాగరిక సమాజానికి దూరంగా అక్కడి గిరిజనుల జీవితాలు ఉంటాయి. వారికి సరైన జీవనోపాధి ఉండదు. పిల్లలకు చదువు చెప్పించే వీలు కాదు. సరైన రవాణా సౌకర్యాలు లేక అడవి దాటి బయటకు రావడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల మధ్య బతుకుతున్న చెంచుల స్థితిగతులు చూసి వారికి తమ వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన తెలంగాణ ట్రాన్స్‌కో అధికారుల బృందంలో మదిలో మెదిలింది.
నెల జీతం నుంచి సాయం :ఏడాది కిందటే వచ్చిన ఈ ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేసే వారంతా తమ నెలవారీ జీతాల నుంచి కొంత మొత్తం పోగు చేశారు. ఆ డబ్బుతో ఇప్పటి దాకా 8 చెంచు గ్రామాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులకు చేదోడుగా నిలిచారు. అడవిలో జీవిస్తున్న ప్రతి కుటుంబానికి ఇంట్లో అవసరమైన గృహోపకరణాలు, దుప్పట్లు, పిల్లలకు ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు అందజేశారు. ఇవి మాత్రమే కాదు అవసరమైన ప్రతి సాయమూ తమకు వీలైనంతగా చేసి మంచి మనసు చాటుకుంటున్నారు.
"నల్లమలలో మరో 100 చెంచు గ్రామ కుటుంబాలకు ఇంకా చేయూత నందించాల్సి ఉంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లోని యువతను ఎంచుకుని వారికి విద్య అందించాలనుకుంటున్నాం. అయితే కొందరు చెంచుల పిల్లలు అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నా దాన్ని కొనసాగించడం లేదు. అలాంటి వారిని దత్తత తీసుకుని హైదరాబాద్ తీసుకురావాలని భావిస్తున్నాం. వారికి నగరంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా మంచి విద్యాబుద్దులు నేర్పించాలనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద కొందరిని ఎంపిక చేసి, అనంతరం మరింత మందికి విద్యను అందేలా చూస్తాం. ఈ ఏడాది నుంచే తమ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నాం." - ట్రాన్స్ కో అధికారుల బృందం