SBI Rural Self Employment Training Institutes For Women : ప్రస్తుత తరుణంలో మహిళలను బయటకు పంపించాలంటే భయపడాల్సిన రోజులివి. అయితే ఆ యువతులు అందుకు పూర్తిగా భిన్నం. ఎస్బీఐ ఆధ్వర్యంలో "గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ"లో శిక్షణపొంది ఉపాధి వైపు పరుగులు పెడుతున్నారు. మగ్గం, కారు డ్రైవింగ్, కుట్టు మిషన్, అల్లికలు వంటి విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజుల పాటు జరిగే శిక్షణలో మెలుకువలు నేర్చుకొని సొంతంగా వ్యాపారం చేసుకుంటామంటున్న మహిళలపై ప్రత్యేక కథనం.
మహిళలకు శిక్షణ : ప్రస్తుత సమాజంలో మహిళలు రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి. అలాంటి తరుణంలో జిల్లా కలెక్టర్ చొరవతో మహిళలకు క్యాబ్‌లు అందుబాటులోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండదనే ఆలోచనతో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మేహిళలు పురుషులకు ఏ మాత్రమూ తీసిపోమంటూ నిరూపిస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణ పొంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతూ అందరి మన్నలు పొందుతున్నారు. మగ్గం, కుట్టుమిషన్, అల్లికలతో పాటు డ్రైవింగ్ శిక్షణలో రాటు తేలుతున్నారు.
ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతుల్లో దాదాపు అందరూ డిగ్రీలు పూర్తి చేసి ఏదో ఒక కొలువు కోసం ఎదురు చూస్తున్నవారే. అయితే "గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ" ఆధ్వర్యంలో ఉచిత భోజన, వసతి కల్పించి ఉపాధిని కల్పించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో చేరి స్వతహాగా తమ కాళ్లపై తాము నిలబడగలము అనే స్థాయికి వెళ్లే విధంగా ఇక్కడ శిక్షణ ఉంటుందంటున్నారీ మహిళలు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ఇంటి వద్దే డబ్బు సంపాధించుకునే విధంగా శిక్షణ తీసుకుంటున్నామన్నారు.