Traffic Police Save the Children in Hyderabad : ఇంట్లో చిన్నపిల్లు ఉన్నారంటే వారి అల్లరి అంతా ఇంతా ఉండదు. వారిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. లేదా పిల్లలు తెలియక చేసే పనులు ఒక్కొసారి పెద్దలకు ఇబ్బందులను తీసుకువస్తాయి. ఎంత అదుపులో ఉంచుదామన్నా, పిల్లలు తెలియనితనంతో ఏదో కొంటె పనులు చేస్తూనే ఉంటారు. తాజాగా పిల్లలు ఆటలాడుతూ రైలు ఎక్కిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎటువెళ్తున్నారో తెలియకుండానే ఆడుకుంటూ రైలెక్కిన చిన్నారులు, గమ్యం తెలియక మరో స్టేషన్‌లో దిగారు. పిల్లలు ఒంటరిగా కనిపించడం, పెద్ద వాళ్లెవరూ పక్కన లేరని గమనించిన ఓ ఆటో డ్రైవర్ వారిని ఫాలో అయ్యాడు. వాళ్లు ఒంటరిగానే ఉన్నారని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ చివరలో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అతడి ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన మంగళవారం రోజున మైలార్‌దేవుపల్లి డివిజన్‌లో చోటుచేసుకుంది.
రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బిల్లా కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కార్తిక్(6), అఖిల్(4) ఇద్దరు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బుద్వేల్ రైల్వేస్టేషన్‌లో శంషాబాద్‌లోని ఉందానగర్ మీదుగా వచ్చే రైలు నుంచి దిగారు. ఇంటికి వెళ్లడానికి దారి తెలియని చిన్నారులు బయటకు వచ్చి కాలినడకన ఆరాంఘర్ చౌరస్తా దాటుతుండగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఠాణా సమీపంలోకి రాగా ఓ ఆటోవాలా వారిని వెంబడిస్తూ అపహరించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు యాదయ్య, వెంకట్‌రెడ్డి, శివలు గుర్తించారు. అతడిని పట్టుకునేలోగా ఆటో డ్రైవర్ అప్రమత్తమై పరారయ్యాడు.