Tiger HulChul in Eluru District :ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నాలుగు రోజులుగా పులి తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పులి అడుగుజాడలు గుర్తించి దానిని పట్టుకోవడానికి అటవీశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. పులి సంచరించిన దెందులూరు మండలం మేదినరావుపాలెం, చల్లచింతలపూడి, పెరుగుగూడెం ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. పోలవరం కుడి కాలువ సమీపంలోని ఓ కాలువతో పాటు స్థానికంగా ఉన్న పలు మొక్కజొన్న తోటలు, మిరప తోటల్లో పులి అడుగులను రైతులు గుర్తించగా వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు.
దెందులూరు మండలంలో పులి ఆనవాళ్లు - ఆందోళనలో గ్రామస్థులు
గ్రామస్థులకు పులి భయం : చల్లచింతలపూడి పాటిమ్మ ఆలయం సమీపంలోని మిరప, మొక్కజొన్న తోటల్లో పులి అడుగులు కనిపించడంతో ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు పులి కదలికను పసికట్టేందుకు మేదినరావుపాలెం సమీపంలో ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. బోనులు సైతం సిద్ధం చేసిన అధికారులు కెమెరాల్లో నిక్షిప్తమైన పులి కదలికలను బట్టి బోన్లు ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు తమ గ్రామంలో పులి సంచారం విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వెళ్లి పులి అడుగులను పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో తమ పశువులు పొలాల్లోనే ఉంటాయని, పులి సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని గ్రామస్థులు కలవరపడుతున్నారు.