CM Chandrababu in Delhi: దావోస్ పర్యటన అనంతరం దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరిరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌కి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 2025-26 సాధారణ బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించినట్లు తెలుస్తోంది.
నిర్మలాసీతారామన్‌తో భేటీ అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు దిల్లీ విమానాశ్రయంలో ఇండోనేషియా వైద్య శాఖ మంత్రి బుడి సాదికిన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. దావోస్ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి దాటాక సీఎం దిల్లీ చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో బుడి సాదికిన్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలో పలువురు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రామ్‌నాథ్ కోవింద్‌లను చంద్రబాబు కలిశారు. వీరితో భేటీ తర్వాత దిల్లీ పర్యటన ముగించుకుని సీఎం విజయవాడ బయల్దేరారు.