Iconic Building in Visakhapatnam : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇక్కడ గూగుల్‌తో పాటు ఇతర ప్రసిద్ధ సంస్థలు వాటి కేంద్రాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా డేటా సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం, గ్లోబల్ బిజినెస్ సెంటర్, చిప్ తయారీ కేంద్రం, గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) వంటివి ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలతో చర్చలు జరిపారు. అయితే తగిన మౌలిక వసతులను సంసిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ(VMRDA)కు చెందిన ఐకానిక్ భవన సముదాయాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు.
నగరం నడిబొడ్డున నౌక ఆకారం : విశాఖపట్నం నగరం నడిబొడ్డున నౌక ఆకారంలో 11 అంతస్తుల్లో బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ సదుపాయం (ఎంఎల్‌సీపీ) నిర్మిస్తున్నారు. ఈ భవనంలోని ఐదు అంతస్తుల్లో 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పార్కింగ్‌కు, అలాగే ఆరు అంతస్తుల్లోని 1.65 లక్షల చదరపు అడుగులను కార్యాలయ అవసరాలకు ఉపయోగించనున్నారు. అన్ని సౌకర్యాలతో అత్యాధునికంగా ఈ భవనాన్ని నిర్మించారు. పార్కింగ్ వసతులతోపాటు ఈ భవనానంలో గాలి, వెలుతురు వచ్చేలా సుందరంగా అద్దాలతో నిర్మించారు.
పెరగనున్న ఏపీ బ్రాండింగ్ : డేటా ఇంక్యుబేషన్ సెంటర్లు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు వీలుగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండటంతో ఈ భవనం మొత్తాన్నీ జీసీసీలకు, బహుళ జాతి సంస్థలకు కేటాయించాలనే ఆలోచన ఉంది. ఈ భవనంలో వెంటనే కార్యకలాపాలు ప్రారంభించి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే పేరున్న సంస్థ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. విశాక నగరం మధ్యలో అన్ని సౌకర్యాలతో అత్యాధునిక భవనం ఉండటంతో ప్రముఖ సంస్థలు వస్తే ఒక బ్రాండింగ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగియడంతో ఈ భవనం మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
భవనం ప్రత్యేకతలు..
విస్తీర్ణం : 1.72 ఎకరాలు
నిర్మాణ వ్యయం : రూ.87.50 కోట్లు
అంతస్తులు : 11 (కార్యాలయాలకు 6, పార్కింగుకు 5)
పార్కింగు : కార్లు 430, ద్విచక్ర వాహనాలు 400
సెయిల్ వద్దంటోంది - కారణం అదే! విశాఖ స్టీల్‌పై కేంద్రమంత్రి క్లారిటీ
ముస్తాబైన విశాఖ క్రూజ్ టెర్మినల్ - త్వరలో లగ్జరీ క్రూజ్ షిప్‌లు రాక