CS Vijayanand on AP Budget Session : సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సీఎస్ కె.విజయానంద్ వర్చువల్గా సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరూ అందుబాటులోనే ఉండాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సమావేశాల నిర్వహణకు సంబంధించి ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.
బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ముందుగానే మంత్రులకు అందజేయాలని విజయానంద్ ఆదేశించారు. అంశాల వారీగా గతంలో తీసుకున్న చర్యలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టంగా తెలిపేలా అందులో ఉండాలని సూచించారు. ఈ మేరకు శాఖల వారీగా ఉన్న నోడల్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సమావేశాలు నిర్వహించే సమయంలోనే స్టార్, అన్ స్టార్ ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చేలా చూడాలని విజయానంద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తగిన సమాచారాన్ని వారికి ముందే అందజేయాలన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఆర్జిత సెలవులు, విదేశీ పర్యటన సెలవులు ఎవ్వరికీ మంజూరు చేయవద్దని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని విజయానంద్ వెల్లడించారు.