Kids Addicting to Mobiles : ఐదో తరగతి చదివే బబ్లూ మొబైల్ గేమ్స్‌కు బానిసయ్యాడు. స్నేహితుల ప్రభావంతో సరదాగా ఆడడం ప్రారంభించి చదువు పక్కనపెట్టి ఫోన్‌పైనే ఎక్కువ గడిపాడు. తండ్రి ఫోన్‌లో గేమింగ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఆడాడు. తండ్రి చూస్తే కోప్పడతాడని ఆడాక యాప్స్‌ను దాచేసి.. తర్వాత యథావిధిగా ఆడేవాడు.
ఓ యాప్‌లో తర్వాత లెవల్ ఆడేందుకు డబ్బు చెల్లించమని వచ్చింది. తండ్రి యూపీఐ పాస్‌వర్డ్ తెలియడంతో వివరాలు నమోదు చేశాడు. అంతే గంటలో రూ.45 వేలు పోయాయి. తర్వాత వరస ఎస్‌ఎంఎస్‌లు చూసి తండ్రి నిర్ఘాంతపోయాడు. బ్యాంకుకెళ్లి ఆరా తీస్తే మొబైల్ గేమింగ్ యాప్స్‌కు వెళ్లినట్లు తేలింది.
మొబైళ్లను పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా వాడేస్తున్నారు. వాటి ఫీచర్లు తల్లిదండ్రుల కంటే పిల్లలకే తెలుస్తున్నాయి. వీటి వాడకంలో ఎక్కువ కుటుంబాల్లో పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంతిమంగా.. ఇది చిన్నారులు ఫోన్లలో ఆటలకు బానిసలుగా మారేందుకు కారణమై.. మానసికంగా విపరీతస్థితికి దారితీస్తోంది. ఎదిగే వయసులో ఈ పరిణామాలు చిట్టి మెదళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని సైకియాట్రిస్టులు అంటున్నారు.
కొవిడ్ నుంచి విపరీత మార్పులు : కొవిడ్ వేళ నెలలుగా పిల్లలు ఇళ్లకే పరిమితమై.. ఆన్‌లైన్‌లోనే తరగతులు హాజరయ్యేవారు. ఫలితంగా ఫోన్, ట్యాబ్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి. వారికి తెలియకుండానే తరగతులు, అసైన్‌మెంట్లు, వినోదానికి బానిసలయ్యారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై నియంత్రణ లేక ఎక్కువ మంది చదువుకు దూరమయ్యారు.
బానిసలుగా ఎందుకిలా : ఆత్మన్యూనత, ఆత్మవిశ్వాస స్థాయి బాగా తక్కువగా ఉన్న పిల్లలు మొబైల్ గేమ్స్‌కు అలవడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడేందుకు వీటిని ఆశ్రయిస్తున్నారు. మొబైల్స్‌లో యాప్స్‌ను దాచే లాంఛర్లు చాలా ఉన్నాయి. వీటిని వాడి పెద్దలకు తెలియకుండా గేమ్ యాప్స్‌ను దాచి, అవసరమైనప్పుడు అన్‌హైడ్ చేసి వాటిని ఆడుతున్నారు.
కొన్ని రకాల యాప్ లాకర్లతో లాక్ చేస్తున్నారు. తేలికపాటి లెవల్ ఆడాక మరోస్థాయికి వెళ్లాలంటే డబ్బు చెల్లించాలి. ఫలానా ఆయుధం వాడాలంటే.. డబ్బు చెల్లించాలని యాప్స్ అడుగుతాయి. తదుపరి లెవల్స్‌కు వెళ్లాలనే ఆత్రుతలో తెలియకుండానే మొబైల్‌లో యూపీఐని యాక్టివేట్ చేస్తున్నారు. ఫలితంగా ఖాతా నుంచి నగదు కొద్దిగా బదిలీ మొదలై పెద్దమొత్తంలో పోతోంది.
తల్లిదండ్రులూ కన్నేసి ఉంచాలి : తల్లిదండ్రులు, పిల్లల మధ్య సరైన సంబంధాలు లేకనే వర్చువల్ ప్రపంచంలో అడుగిడి... పిల్లలు ఆనందం, తృప్తి పొందుతారు. ఎవరి ప్రపంచంలో వారు ఉండడం ఈ పరిస్థితులకు దారితీస్తోంది. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడే సమయం కేటాయించకనే వారు దారితప్పుతున్నారు. పిల్లల నైతిక ప్రవర్తనలోనూ మార్పులు వస్తున్నాయి. పిల్లల వెన్నంటి నిలిచి వారిని చక్కదిద్దే బాధ్యత అమ్మానాన్నలదే.
'ఏడుస్తున్నారని ఇచ్చేస్తున్నారా!' - ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎన్నో సమస్యలు - వైద్యులు ఏమంటున్నారంటే!
యూపీఐ పిన్ పిల్లలతో పంచుకోవద్దు
- బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన నంబరు ఉన్న ఫోన్‌ను పిల్లలకు ఇవ్వకూడదు.
- ఎస్‌ఎంఎస్ అనుమతి ద్వారా యూపీఐను యాక్టివేట్ చేసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేసే ప్రమాదం.
- యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్‌కు పెట్టుకునే పిన్‌లను చిన్నారులతో పంచుకోవద్దు.
- మనకు తెలియకుండానే మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయిన గేమింగ్ యాప్స్ మన లావాదేవీలను రికార్డు చేస్తుంటాయి.
- గేమ్స్ ఆడేటప్పుడు ఎస్‌ఎంఎస్, ఫోన్‌లో సున్నిత సమాచారం యాక్సెస్‌కు అనుమతి ఇవ్వకూడదు.
స్క్రీన్ టైమ్‌పై నియంత్రణ అవసరం
- మొబైల్ చూసేందుకు ఏకాంతంగా పిల్లలను అనుమతించకూడదు. తమ పర్యవేక్షణ ఉండేచోటే ఉంచాలి.
- గేమింగ్ నియంత్రణలను అనుసరించడం మంచిది. స్క్రీన్ టైమ్ నియంత్రణ పెట్టాలి.
- పిల్లలతో తల్లిదండ్రులు తరచూ మాట్లాడితే.. వారి ఇబ్బందులు తెలుసుకుని, పరిష్కరించే వీలుంది.
- పిల్లల దృష్టి ఇతర వ్యాపకాల వైపు మళ్లించాలి.
- శారీరక, మానసిక వికాసానికి క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర ఔట్‌డోర్ గేమ్స్ ఆడేలా శిక్షణ ఇప్పించాలి..
మీ పిల్లలు ఏది చూసినా కొనివ్వమంటున్నారా? - ఇలా చేస్తే ఊహించని మార్పు తథ్యం