Tiger Attack on Farmer in Komaram Bheem District :మహారాష్ట్ర నుంచి మేటింగ్ కోసం వచ్చినట్లు భావిస్తున్న పెద్దపులల సంచారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం గన్నారానికి చెందిన మోర్లే లక్ష్మిని పులి హతమార్చిన ఘటన మరవకముందే ఇవాళ సిర్పూర్(టి) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేశ్‌పై దాడి చేసింది. పోలంలో పని చేసుకుంటున్న సురేశ్‌పై వెనక నుంచి వచ్చి మెడపై పులిదాడి చేసింది. భయంతో స్థానికులు అరుపులు, కేకలు వేయటంతో పులి అటవీప్రాంతానికి పారిపోయింది.
పులి పంజాకు మెడపై తీవ్రగాయమైన సురేశ్‌ను సిర్పూర్(టి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రాంతానికి తరలించారు. మోర్లే లక్ష్మి మృతితో అప్రమత్తమైన అటవీశాఖ, డ్రోన్ సాయంతో పులి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీ సిబ్బంది బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి వేంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని నజ్రుల్‌నగర్ విలేజ్ నంబర్ 10, 9, 11, 6 సహా అనుకోడ, బాపూనగర్, కడంబ శివారులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులి ఆచూకీ లభించలేదు. మరోవైపు పులి సిర్పూర్(టి)లో ప్రత్యక్షమైన సురేశ్‌పై దాడి చేయడం కలకలం రేకెత్తిస్తోంది.
'అధికారులు మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మాకు ముందుస్తుగా సమాచారం ఇస్తే పొలం పనులకు వెళ్లేవాళ్లం కాదు. శుక్రవారం మోర్లే లక్ష్మిపై పులి దాడి చేసింది. వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందుకే ఈ ఘటన జరిగింది'-ముసారం సంతోష్, కడంబ గ్రామవాసీ