Three Young People Drowned in Pond at Nizamabad :ఎండాకాలం మొదలవడంతో పట్టణాలు, గ్రామాల్లోని పిల్లలు చెరువులు, బావులు, కాలువల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈత సరదా కాస్తా కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తోంది. ఓవైపు ఈతపై ప్రావీణ్యం లేకపోవడం, మరోవైపు నీటి వనరుల లోతుపై అంచనా లేమి, కొలనుల వద్ద పర్యవేక్షణ కొరవడటం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోంది. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట జరుగుతున్న ఈ ఘటనలు ప్రస్తుతం ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Drown Deaths in Telangana : పిల్లల ఈత సరదా (Three Persons Died After Going Swimming) ముగ్గురు తల్లులకు కడుపుకోత మిగల్చగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తల్లిదండ్రులకు ముగ్గురూ ఏకైక సంతానం కావడం వారంతా చెరువులో మునిగి మరణించడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన మాక్లూర్ మండలం ఒడ్డ్యాట్‌పల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడ్డ్యాట్‌పల్లి గ్రామానికి చెందిన తిరుపతి(19), మహేశ్(19), నరేశ్(18), సాయితేజ(19), వినోద్(18)లు గ్రామశివారులో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు.
ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం.. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి..
లోపలికి దిగిన కొద్దిసేపటికే మహేశ్, నరేశ్, తిరుపతి మునిగిపోయారు. వినోద్ కూడా మునిగిపోతుండగా సాయితేజ అతడిని అతి కష్టమ్మీద కాపాడి ఒడ్డుకు చేర్చాడు. వెంటనే ఇరువురూ గ్రామంలోకి పరుగుపెట్టి విషయం స్థానికులకు చేరవేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశామని వివరించారు.