Telangana Maoists Died In Chhattisgarh Encounter :తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్‌లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని గుర్తించగా అందులో ముగ్గురు తెలంగాణకు చెందినవారు ఉన్నారు. వారిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్ ఝిస్సు అలియాస్ చీమల నర్సయ్య (66), మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన వినయ్ అలియాస్ కేశబోయిన అలియాస్ రవి (55), వరంగల్‌కు చెందిన సుష్మిత అలియాస్ చైతె (26)గా గుర్తించారు. వీరు చాలా సంవత్సరాల నుంచి ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నారు.
తెలంగాణ మావోయిస్టులు మృతి : స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196 కేసులు ఉండగా ప్రభుత్వం ఆయనపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడైన రవిపై రూ.8 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యురాలైన తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డు ఉంది. గత నెల 16న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మరణించారు.
వారిలో భూపాలపల్లి జిల్లాకు చెందిన శంకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆయన భార్య దాసర్వర్ సుమన అలియాస్ రజిత ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో తాజాగా ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మరణించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యమం బలహీనపడగా, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారు వరుసగా ఐదుగురు మృతిచెందడంతో మావోయిస్టు పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- 10 మంది మావోయిస్టులు హతం - Naxalites Killed In Encounter