Decline in Cold Wave In Telangana Says IMD : రాష్ట్రంలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని దీని ప్రభావంతో రాత్రివేళ ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. తెల్లవారుజామున చలితీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయన్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఈ ఏడాది చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు.
కురుస్తున్న మంచు : మరోవైపు తెలంగాణలో ఇప్పటికే మంచు కురుస్తోంది. ఉదయం పూట మంచు కారణంగా రోడ్లపై వాహనాలు కనిపించడం లేదు. ప్రజలు రోడ్లపై జాగ్రత్తగా వహించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కానీ రాత్రిళ్లు మాత్రం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఇలా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల ఈ ఏడాది చలి తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
చలికాలంలో గొంతు నొప్పి వేధిస్తోందా? ఇలా చేస్తే అంతా సెట్!
అప్పటి వరకు మోస్తరు వర్షాలు :మరోవైపు దేశ వాయువ్య భాగమైన పంజాబ్, దిల్లీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారానికి మధ్య, ఈశాన్య భారత దేశాన్ని రుతు పవనాలు వీడినట్లయితే నిర్దిష్ట అంచనాల మేరకే కదలికలు ఉన్నట్లు భావిస్తారు. ఆలస్యమైతే మాత్రం ఈ నెల, వచ్చే నెల చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17 నాటికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను దాటి పవనాలు వెనక్కి వెళ్లిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అప్పటి వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్ల నుంచి చలి తీవ్రత అధికంగానే ఉంటోంది.
వయస్సు పైబడినవారు జాగ్రత్త : ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వైద్యులు పలు సలహాలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకుపోవటంతో పాటు, రక్తం గడ్డ కట్టే సమస్యలు ఈ కాలంలో అధికంగా ఉంటాయని చెబుతున్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా బాడీ చెకప్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
శీతాకాలంలో మీ జుట్టుకు నూనె రాస్తున్నారా? ఎన్ని లాభాలో తెలుసా?
చలికాలంలో పిల్లలకు న్యూమోనియా ప్రమాదం - ఇలా చేయండి - లేకపోతే ఇబ్బందే!