HC on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA), విజిలెన్స్ విచారణతో పాటు న్యాయ విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌ను నియమించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నిర్మాణలోపాలు మేడిగడ్డ కుంగుబాటు తదితరాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను, వేసవి సెలవుల తరువాత చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి నిర్మాణాలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ. పాల్(KA Paul), న్యాయవాది బి రామ్మోహన్ రెడ్డి, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, న్యాయవాది విశ్వనాథరెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కె.ఎ.పాల్ వాదనలు వినిపిస్తూ కాగ్ రిపోర్టు ఆధారంగా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
Investigation on Kaleshwaram :కేటాయించిన నిధుల్లో కేవలం 52 శాతం మాత్రమే వినియోగించినట్లు కాగ్(CAG) పేర్కొందన్నారు. భారీ అవినీతి జరిగిందని 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని, సీబీఐ దర్యాప్తు ప్రారంబించేలా ఆదేశాలివ్వాలనీ కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషన్‌పై ఏం ఉత్తర్వులు ఇవ్వాలన్న దానిపై సలహాలు అవసరం లేదంది. ఉత్తర్యులు ఇవ్వడానికి మీ అనుమతి అవసరంలేదని వాధనలు మాత్రమే వినిపించాలని హితవు పలికింది.
ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని చెబుతుండగా, సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని అసలు ప్రభుత్వ వాదన వినకుండా ఏకపక్షంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉత్తర్వుకు ఇవ్వాలా అని ప్రశ్నించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం కింద, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ సుదర్శన్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లపై మార్చి 4న ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొంది.