Tirumala Brahmotsavam 2024 :తిరుమల తిరుపతి దేవస్థానంలో అంగరంగవైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 8 రోజులపాటు వివిధ వాహన సేవలపై అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో కన్నా మిన్నగా పకడ్బందీగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేసింది. సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలేశుని వాహనసేవలను తిలకించారు. అన్నప్రసాదం సహా తిరుమల లడ్డూలోనూ నాణ్యత పెరిగిందని భక్తులు అభిప్రాయపడినట్లుగా టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు :తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 8 రోజుల పాటు వివిధ వాహనసేవలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్పస్వామికి చివరి రోజు పుష్కరిణిలో చక్రస్నానం కన్నులపండువగా సాగింది. శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, చక్రత్తాళ్వర్కు వేదపండితులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు.
శాస్త్రోక్తంగా చక్రస్నానం, తిరుమంజనం: బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టి విజయవంతం చేశారు. భక్తులకు పెద్దపీట వేస్తూ దేవస్థానంలోని పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా టీటీడీ నిర్వహించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. శనివారం ఉదయం బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టమైన చక్రస్నానంను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు వేదపండితులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. చక్రత్తాళ్వారుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం చేయించారు.