Telangana High Court on Phone Tapping Case : రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. ఈ క్రమంలో ఫోన్లను ట్యాప్ చేయాల్సి వస్తే ఆయా రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని కేంద్రం బుధవారం రోజున తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. దీనికి కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరం లేదని కేంద్రం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
సస్పెండెడ్ అయిన ఎస్ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తుందనే విషయం విదితమే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
కేసు కౌంటర్‌ను రికార్డుల్లో ఉంచాలి: రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఇంతక్రితమే హైకోర్టులో దర్యాప్తు వివరాలతో కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే అది రికార్డుల్లో లేకపోవడంతో ఈ నెల 23కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వం వేసిన కౌంటర్‌ను రికార్డుల్లో ఉంచాలని న్యాయస్థానం రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే న్యాయస్థానం ఓ సూచనను చేసింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కౌంటరు దాఖలు చేయాలని భావిస్తే తదుపరి విచారణలోగానే చేయాలంటూ కేంద్రానికి సూచించింది.