Heavy Floods in Hyderabad :వరుసగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై ఉన్న చెట్లు, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుపై విరిగిపడ్డాయి. హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారడంతో సమీపంలోని నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
కరెంట్ షాక్‌తో ప్రిన్సిపల్ మృతి : గాజులరామారంలోని పలు కాలనీలు జలమయం కాగా, రోడ్లపై వరద ప్రవహిస్తోంది. మేడ్చల్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పంట పొలాలు నీటమునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తప్పలేదు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగిస్తుండగా, కరెంట్ తీగలు తగిలి ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
చిన్నారి మృతి : రంగారెడ్డి జిల్లా దేవునిపల్లిలో చేపల వేటకు వెళ్లిన శేఖర్ చెరువులో పడి ప్రాణాలొదిలాడు. షాద్‌నగర్‌లోని నోబుల్ పార్క్ కాలనీ వర్షం నీటిలో పడి 13 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు, బిహార్‌కు చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు ఓ భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. షాద్‌నగర్ బైపాస్ కేశంపేట రోడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి గేదె చనిపోయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.