TGSPDCL Power Monitoring : గతంతో పోల్చుకుంటే టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెల్లడించింది. విద్యుత్ అంతరాయాలు, అంతరాయం సమయాల్లో గణనీయమైన క్షీణతను నమోదు చేసిందని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గతేడాది జనవరి నుంచి మే నెల వరకు ఉన్న అంతరాయాలు ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు ఉన్న అంతరాయాలతో పోల్చుకుంటే 33 కేవీ ఫీడర్ స్థాయిలో 43.5 శాతం క్షీణతను నమోదు చేశాయని సంస్థ వెల్లడించింది.
నెలలో సరాసరిగా ఒక 33 కేవీ ఫీడర్ పరిధిలో గతంలో 47.3 నిమిషాల అంతరాయం ఉండగా ప్రస్తుతం 26.7 నిమిషాలుగా ఉన్నది అని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ పేర్కొన్నారు. అదేవిధంగా ఒక 11 కేవీ ఫీడర్ పరిధిలో గతంలో 17.16 నిమిషాల అంతరాయం ఉండగా, ప్రస్తుతం 13.31 నిమిషాలుగా ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక 1.80 కోట్ల వినియోగదారులుండగా, వాటిలో ఒక 1.14 కోట్ల వినియోగదారులకు, అంటే దాదాపు 63.33 శాతం వినియోగదారులకు దక్షిణ డిస్కం ద్వారా విద్యుత్ సరఫరా అందజేస్తున్నామన్నారు.
అందుకే విద్యుత్ సరఫరాకు అంతరాయం : ప్రస్తుతం దక్షిణ డిస్కంలో 11 కేవీ ఫీడర్లు 8,546 వరకు, 33 కేవీ ఫీడర్లు 1,422 వరకు ఉన్నాయి. వీటితో పాటు 2.48 లక్షల కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు, 1.17 లక్షల కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 16,000 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు ఉన్నాయి. భారీవర్షాలు, గాలులు ఏర్పడినప్పుడు చెట్లు, వాటి కొమ్మలు విద్యుత్ స్తంభాలపై కూలడం వలన, ఎల్‌టీ లైన్లపై చెట్ల కొమ్మలు పడటం, బ్యానెర్లు, ఫ్లెక్సీ వంటి ఇతర వస్తువులు లైన్లపై పడటం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.