TGSPDCL CMD Review on Power Cuts :రెమాల్ తుపాను ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఈదురుగాలులు, రాళ్ల వానతో జనజీవనం స్తంభించింది.ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల్, వనపర్తి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మేడ్చల్ జిల్లాలో భారీ గాలులతో కూడిన వర్షానికి పెద్ద పెద్ద చెట్లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై, స్తంభాలపై పడటంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది అని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
ప్రభావిత జిల్లాల సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో సీఎండీ ముషారఫ్ ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని క్షేత్ర కార్యాలయాల్లో సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండటంతో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టి చాలా వరకు 33 కేవీ, 11 కేవీ ఫీడర్లలో సరఫరా పునరుద్ధరించడం జరిగిందన్నారు.
Heavy Rain Effect in Telangana : కొన్ని ప్రాంతాల్లో ఎల్.టీ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా పునరుద్దరించాలని సీఎండీ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి అధికారి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు నేలమీద పడ్డ లైన్లను, స్థంభాలు ఇతర విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు విద్యుత్ సిబ్బందికి, కంట్రోల్ రూమ్‌కు కాని సమాచారం అందించాలన్నారు.