తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి నుంచే గ్రూప్-​2 పరీక్షలు - బయోమెట్రిక్​ నిబంధన మర్చిపోవద్దు - TELANGANA GROUP2 EXAMS UPDATE

రేపటి నుంచి 2 రోజుల పాటు గ్రూప్​-2 పరీక్షలు - ఏర్పాట్లను పరిశీలించిన టీజీపీఎస్సీ ఛైర్మన్​ బుర్రా వెంకటేశం - అభ్యర్థులందరికీ బయోమెట్రిక్​ తప్పనిసరని వెల్లడి

TGPSC Arrangements For Group2 Exam
TGPSC Arrangements For Group2 Exam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

TGPSC Arrangements For Group2 Exam :రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 సర్వీసుల పోస్టుల భర్తీకి రేపటి నుంచి 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వాహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను టీజీపీఎస్సీ సిద్ధం చేసింది. పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ ఎగ్జామ్​కు 5,55,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసినప్పటికీ వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి.

గ్రూప్​-2 పరీక్షలో ఒక్కోపేపర్‌కు 150 మార్క్స్​ చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది. ఎగ్జామ్స్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని తెలంగాణ పబ్లిక్​ సర్వీస్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.

అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచనలు ఇవే : హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో ఐడీ కార్డును అభ్యర్థులు తీసుకురావాలని టీజీపీఎస్సీ తెలిపింది. మంగళసూత్రం, గాజులు ధరించవచ్చని, అభ్యర్థులు చెప్పులు వేసుకుని రావొచ్చని సూచించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ బయోమెట్రిక్​ను తప్పనిసరి వేయాలని లేదంటే ఓఎంఆర్‌ పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీజీపీఎస్సీ తెలిపింది.

గ్రూప్‌ 2 పరీక్షల ఫలితాలు వేగంగా ఇస్తాం : రాష్ట్రంలో ఆదివారం, సోమవారం జరగనున్నటువంటి గ్రూప్‌-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం వెల్లడించారు. 10 రోజులుగా అన్ని అంశాలను సమీక్షించామని తెలిపారు. గ్రూప్​-2 పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై నమ్మకముంచి పరీక్షలు రాయాలని ఛైర్మన్​ కోరారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశాం. అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలును పెట్టుకోవద్దు. మెరిట్(ప్రతిభ) ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. 5.51 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. పత్రి ఒక్క అభ్యర్థికి బయోమెట్రిక్‌ తప్పనిసరి. ప్రశ్నాపత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశాం. అభ్యర్థికి తప్ప క్వశ్చన్​ పేపర్ ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. 2015లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం తీసుకున్నారు. ఈసారి వేగంగా గ్రూప్​-2 ఫలితాలను ఇస్తాం'- బుర్రా వెంకటేశం, టీజీపీఎస్సీ ఛైర్మన్‌

మీరు గ్రూప్-2 ఎగ్జామ్ రాస్తున్నారా - ఇవి లేకపోతే పరీక్ష రాసేందుకు 'నో ఎంట్రీ'

గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల - ఇలా డౌన్​లోడ్ చేసుకోండి

ABOUT THE AUTHOR

...view details