Drug Cases in Hyderabad :దినదినాభివృద్ధి చెందుతున్న భాగ్యనగరానికి మాదకద్రవ్యాల చెద పట్టుకుంది. ఇది వేగంగా నగరంలో విస్తరిస్తోంది. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసి నిందితులను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నా సరే.. హైదరాబాద్‌లోకి డ్రగ్స్‌ను పెడ్లర్లు, ఎడిక్టర్లు అక్రమమార్గాల్లో చేరవేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నిఘా మరింత పెంచారు. డ్రగ్స్ వాడేవారికి, సరఫరా చేసేవారికి టీజీన్యాబ్ పోలీసులు ఓ హెచ్చరికను పంపారు. ఆనందంగా గడపాల్సిన వేడుకల్లో మాదకద్రవ్యాలకు చోటిస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని చెప్పారు.
ఇకనుంచి రిసార్ట్లు, పబ్‌లు, ఫామ్హౌస్లల్లో నిర్వహించే పార్టీల్లో అకస్మిక తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గతంలో డ్రగ్స్ చేరవేస్తూ అరెస్టయిన వారిపై నిఘాను పోలీసులు ఉంచారు. జైలుకెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకుండా దందా సాగిస్తున్న కొందరిని టీజీ న్యాబ్ పోలీసులు మందలించినట్లు సమాచారం. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తప్పటడుగు వేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు డైరెక్టర్లు, వార్డెన్లను టీజీన్యాబ్ పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
నగరానికి ముందుగానే సరకు : మూడు రోజుల వ్యవధిలోనే మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నాలుగు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఏటా అధికశాతం మత్తుపదార్థాలు నయాసాల్ వేడుకలే లక్ష్యంగా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో 20 రోజుల ముందు నుంచే సరకు చేరవేస్తున్నారని తెలిపారు. న్యూఇయర్ సంబరాలు లక్ష్యంగా నైజీరియన్లు, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి చేరుతున్నాయనే సమాచారం టీజీన్యాబ్ దృష్టికి ప్రత్యేకంగా వచ్చింది. దీంతో బెంగళూరు, గోవా, ముంబయి, ఏపీ, ఒడిశా నుంచి సరకు నగరానికి చేరే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.