TG Govt Provide Evening Snacks To 10th students :రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం సాయంత్రం పూట అల్పాహారం అందించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలకు వచ్చేనెల ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ మధ్య పాఠశాలలు నడిచే 38 రోజులపాటు అల్పాహారం ఇవ్వనున్నారు.
పదోతరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం : మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం తింటే ప్రత్యేక తరగతులు పూర్తయి ఇళ్లకు వెళ్లేసరికి ఇతర గ్రామాల విద్యార్థులకు రాత్రి 7 గంటల సమయం పడుతుంది. దీంతో అప్పటి వరకు ఏమీ తినకపోవడంతో ఆకలితో చదవలేకపోతున్నారు. గతంలో కలెక్టర్ల నిర్ణయం మేరకు కొన్ని జిల్లాల్లోని స్కూళ్లలో సాయంత్రం పూట స్నాక్స్ పెట్టేవారు. 2023లోనూ విద్యాశాఖే ‘సమగ్ర శిక్ష’ ద్వారా 34 రోజులపాటు వాటిని అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అమలు కాలేదు. ఈ సారి ఎలాాంటి అడ్డంకులు లేకపోవడంతో ప్రభుత్వం ఆలోచించి సాయంత్రం పూట చదువుకునే పిల్లలకు అల్పాహారం అందించాలని నిర్ణయించుకుంది.