TS SSC Results 2024 Date: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్. రిజల్ట్స్ కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈరోజు ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తేలనున్న 5 లక్షల మంది భవితవ్యం:తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్షలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 8వేల 385 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. ఇందులో బాలురు 2లక్షల 57వేల 952 మంది కాగా, బాలికలు 2లక్షల, 50వేల 433 మంది ఉన్నారు. సుమారుగా 30వేల మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ 20లోపు మూల్యాంకనం పూర్తి చేశారు. అలాగే మార్కుల నమోదుతో పాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకుని ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే మంత్రులు కాకుండా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఫలితాలు ఈ రోజునే:పదో తరగతి ఫలితాలను రేపు(ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం (2023) మే 10న ఫలితాలు విడుదల చేయగా.. ఈ సంవత్సరం(2024) పది రోజుల ముందుగానే అంటే ఏప్రిల్ 30నే విడుదల చేయనున్నారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించనున్నారు.