తెలంగాణ

telangana

నగరంలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం - ఆన్‌లైన్‌ వేదికగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు - DRUGS BUST IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 9:50 PM IST

DRUGS BUST IN HYDERABAD : నగరంలో వేర్వేరు చోట్ల డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఇండియా మార్ట్ ఆన్‌లైన్‌ వేదికగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. సదరు వెబ్‌సైట్‌ సంస్థకు నోటీసులు ఇచ్చారు. మరో ఘటనలో ఘట్‌కేసర్‌లో రూ.4 కోట్ల 30 లక్షల విలువైన 620 గ్రాముల హెరాయిన్ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

DRUGS BUST IN TELANGANA
DRUGS BUST IN HYDERABAD (ETV Bharat)

DRUGS BUST IN TELANGANA :సీఎం ఆదేశాలతో పోలీసులు డ్రగ్స్‌ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. సోదాలు విస్తృతం చేశారు. ఇవాళ ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.రాజస్థాన్‌ నుంచి కారులో మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు సరఫరాదారులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4 కోట్ల 30 లక్షల విలువైన 620 గ్రాముల హెరాయిన్ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఎలక్ట్రిక్ షాప్‌ వేదికగా డ్రగ్స్ విక్రయిస్తుండగా, నిందితులతో పాటు ఐదుగురు కొనుగోలుదారులను అరెస్టు చేశారు.

గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు : ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్న గంజాయి చాక్లెట్ల వ్యాపారానికి తెలంగాణ పోలీసులు చెక్‌ పెట్టారు. గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న 8 కంపెనీలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఇండియా మార్ట్ ద్వారా రాష్ట్రానికి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్ర ఆధీనంలోని ఏన్‌సీబీతో కలిసి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని 8 కంపెనీలను మూయించి, ఇద్దరు యజమానులను అరెస్టు చేశారు.

కర్మాగారాల్లో సోదాల సమయంలో సేకరించిన నమూనాలను, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ 8 కర్మాగారాల్లో గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్‌ చేస్తే కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇండియా మార్ట్‌కు టీజీ ఏఎన్‌బీ నోటీసులు పంపించింది. దీంతో స్పందించిన ఆ సంస్థ, ఈ తరహా ఉత్పత్తులన్నింటినీ తమ వెబ్​సైట్ నుంచి వెంటనే తొలగించింది. అలాగే వీటిని డెలివరీ చేసిన కొరియర్ సంస్థలనూ బాధ్యుల్ని చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

కూకట్‌పల్లిలో డ్రగ్స్ స్వాధీనం :మరో ఘటనలోబెంగూళూరు నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్‌టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన పీవీ రాహుల్‌, మహేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులు, కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తులకు అందించడానికి తీసుకువస్తున్న 29.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను డీఎస్పీ తుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో పట్టుకున్నారు. ఈ కేసులో నితిన్‌ రెడ్డికి, నైజీరీయాకు చెందిన జాక్సన్‌ అనే వ్యక్తులకు ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.4.50 లక్షలు ఉంటుందన్నారు.

నాటు సారా తయారీ బెల్లం పట్టివేత :మరో కేసులో కొల్లాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో నాటుసారా తయారు చేయడానికి కర్ణాటక నుంచి వాహనంలో తరలిస్తున్న బెల్లం, ఆలంను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. రూ.1.20 లక్షల విలువ చేసే బెల్లం, ఆలంతో పాటు వాహనం విలువ రూ.15 లక్షల మేరకు ఉంటుందన్నారు. ఆగస్టు 31 నాటికి తెలంగాణలో అన్ని జిల్లాల్లో నాటు సారాను లేకుండా చేయడంతో పాటు, హైదరాబాద్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ పేరుతో గంజాయి అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్నామని అన్నారు.

స్నాప్​చాట్​లో డీలింగ్స్ - కోడ్​ భాషలో స్మగ్లింగ్ - నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు - Snapchat Drugs Case In Hyderabad

హైదరాబాద్​లో రూ.కోటి విలువైన డ్రగ్స్ పట్టివేత - నెైజీరియన్ సహా ముగ్గురి అరెస్టు - POLICE SEIZE DRUGS IN HYDERABAD

ABOUT THE AUTHOR

...view details